iDreamPost
android-app
ios-app

హిందుత్వ పార్టీ అని ఎలా గుర్తిస్తారు థియోధర్‌?

  • Published Mar 03, 2022 | 12:42 PM Updated Updated Mar 03, 2022 | 1:31 PM
హిందుత్వ పార్టీ అని ఎలా గుర్తిస్తారు థియోధర్‌?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ సునీల్‌ థియోధర్‌ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం పార్లమెంట్‌ స్థాయి శక్తి కేంద్రాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హిందూ వ్యతిరేక పార్టీలని టీడీపీ, వైఎస్సార్‌ సీపీలను తీవ్రంగా విమర్శించడమే కాక భవిష్యత్తులో బీజేపీ, జనసేన కలసి ప్రయాణం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2018 వరకు కేంద్రంలోను, రాష్ట్రంలోను నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీతో అధికారం పంచుకున్న బీజేపీ… అప్పట్లో టీడీపీనీ హిందూ అనుకూల పార్టీగా భావించిందా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జనసేన హిందూ అనుకూల పార్టీగా కనిపించడంతోనే భవిష్యత్తులో కలసి ప్రయాణిస్తామని చెబుతున్నారా? అన్న అనుమానం వస్తోందని అంటున్నారు.

పార్టీల మధ్య పొత్తుకు మతమే ప్రాతిపదికా?

సునీల్‌ థియోధర్‌ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ మతతత్వ పార్టీ అని మరింత స్పష్టంగా చెప్పినట్టు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎన్నికల్లో పెట్టుకొనే పొత్తులకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుందని చెప్పడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాల వారు సోదరుల్లా కలసిపోయి సహ జీవనం చేస్తున్నారు.
ఇక్కడ మత రాజకీయాల ద్వారా ఓట్లు రాబట్టాలని బీజేపీ చూస్తోంది. ప్రజలను మతం ప్రాతిపదికన విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే బీజేపీ పప్పులు ఇక్కడ ఉడకవు అని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. గతంలో అంతర్వేదిలో రథం దగ్థం, దేవాలయాల్లో విగ్రహాల కూల్చివేత, రామతీర్థంలో విగ్రహం ధ్వంసం వంటి ఘటనలప్పుడు టీడీపీతో కలసి ప్రభుత్వంపై బీజేపీ బురద జల్లింది. ఆ ఘటనల ఆధారంగా రాష్ట్రంలో మత విద్వేషాలు రగల్చడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇలాగైతే కమలం ఎప్పటికి వికసించేను..

ఏడున్నరేళ్లుగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి చేకూర్చిన ప్రయోజనాలు ఇవి అని చెప్పి ఓట్లు అడగాలి. లేదా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఫలానా మేళ్లు చేస్తాం అని హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాలి. అంతేకాని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తామని ఇంత బాహాటంగా ప్రకటించడం ఏమిటి? ఆది నుంచి సెక్యులర్‌ భావాలకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వైఖరి తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటికి బలపడుతుంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పటిష్ట పరచడం, జనంలోకి తీసుకెళ్లడం చేతకాక ఇలాంటి మతోన్మాదాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలవు అన్న సంగతి బీజేపీ నేతలు గమనించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు సూచిస్తున్నారు.