Idream media
Idream media
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది బీఎస్పీ అధినేత మాయావతి పరిస్థితి. తనను రాష్ట్రపతిని చేస్తున్నారంటూ ప్రచారం చేసి బీజేపీ గెలిచిందని ఆమె తాజాగా ఆరోపిస్తున్నారు. ఆదివారం లక్నోలో పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. తనను రాష్ట్రపతిని చేస్తున్నారని తన ప్రజల్ని నమ్మంచి బీజేపీ ఓట్లు దండుకుందని మాయావతి వాపోయారు. మా సోదరి రాష్ట్రపతి అవుతుందని ప్రజలు బీజేపీని గెలిపించారంటూ మాట్లాడిన మాయావతికి ఎన్నికలు అయిపోయిన నెల రోజులకు గాను జ్ఞానోదయం అయినట్లుగా ఉంది.
పుణ్య కాలం తెల్లారిపోయిన తర్వాత..
తనను రాష్ట్రపతిని చేస్తున్నామని బీజేపీ ప్రచారం చేసి ఓట్లు దండుకుందని చెబుతున్న మాయావతి.. పుణ్యకాలం తెల్లారిపోయిన తర్వాత మేల్కొన్నారు. ఎన్నికల సమయంలో చెప్పాల్సిన మాటలు ఇప్పుడు చెబుతున్నారు. మా పార్టీ అంతం అవుతుందని తెలిసినప్పుడు నేను ఆ పదవికి ఎలా అంగీకరిస్తానని అన్నారు.బీజేపీ నుంచే కాదు ఏ పార్టీ నుంచి ఆ ఆఫర్ వచ్చినా తీసుకునే ప్రసక్తేలేదని చెప్పుకొచ్చారు. ఇది తప్పుదారి పట్టించే ప్రచారం, ఆ ట్రాప్‌లో పడొద్దని మాయావతి సూచించారు.
ఈ విషయం ఎన్నికల సమయంలో చెబితే ప్రయోజనం ఉండేది. అప్పుడు మాట్లాడకుండా, బీజేపీ చేస్తున్న ప్రచారానికి బలం చేకూరేలా మాయావతి వ్యవహరించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయలేదు, పైగా 403 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. వారి తరపున కనీసం ప్రచారం చేయలేదు. మేము బహిరంగ సభలు నిర్వహించం, ఇంటింటికి తిరిగి ఓట్లు అడగం అంటూ భిన్నమైన వైఖరిని అవలంభించారు. బీజేపీ నుంచి ప్రశంసలు వస్తే.. వాటిని నవ్వుతూ స్వీకరించారు. పైగా అమిత్‌షాకు తనపై గౌరవం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వైఖరిని అవలంభించిన మాయావతి.. ఇప్పుడు బీజేపీ కుట్ర చేసింది, నన్ను రాష్ట్రపతిని చేస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుంది.. అంటూ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.
వచ్చినా స్వీకరించరట..
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు రాష్ట్రపతి పదవి ఆఫర్ వచ్చింది. అయితే తాను ఉండాల్సింది బంగళాల్లో కాదని ప్రజల్లో ఉంటానని చెప్పిన కాన్షీరాం ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా లోక్‌సభలో చెప్పారు. మళ్లీ తాజాగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి బీజేపీ నుంచి ఆ ఆఫర్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మాయావతిని దించబోతున్నారంటూ చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. మాయావతి సగటు రాజకీయ నేతగా మాట్లాడుతున్నారు. తాను ఒక్కదాన్నే రాష్ట్రపతి అయి ఏం చేయాలి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మా లక్ష్యాలకు ఇలాంటి పదవులు సూటవ్వవని చెబుతున్నారు. గతంలో కాన్షీరాం తిరస్కరించారని, తాను ఆయన శిష్యురాలిని అంటూ రాష్ట్రపతి పదవి ఆఫర్ వచ్చినా స్వీకరించబోనని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్–జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి.