Dharani
Dharani
తెలంగాణలో ఎన్నికల ముందు రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అన్ని పార్టీలలోని అసంతృప్తి నేతలు మీడియా ముఖంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ పార్టీలో.. అనూహ్యంగా ఎన్నికలకు ముందు అంతర్గత కుమ్ములాటలు తెర మీదకు వస్తున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు.. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఆయన పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
ఢిల్లీ టూర్‌లో ఉన్న రఘునందన రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘నేను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడు పదవుల్లో నాకు ఏదో ఒక పదవి ఇవ్వాలి. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపంగా మారుతుంది. మరో రెండు నెలల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. రెండో సారి దుబ్బాక నుంచి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా. నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను బీజేపీలోనే ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు రఘునందన్ రావు.
‘‘ఇక మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ. 100 కోట్లు ఖర్చుపెట్టినా గెలవలేదు. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాడిని. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు . కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా నాకు మాత్రమే ఉంది. దుబ్బాకలో నాకంటే ముందు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 3500 మాత్రమే. దుబ్బాకలో జనాలు నన్ను చూసే ఓటు వేశారు తప్ప బీజేపీని చూసి కాదు . ఈ పదేళ్ళలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదు. నేను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారు’’ అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీ అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలపై కూడా రఘునందన్ రావు స్పందించారు. ‘‘బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధం. ఒకప్పుడు పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన బండి సంజయ్‌కి నేడు వంద కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది. పార్టీ డబ్బులో నాకు వాటా ఉంది. తరుణ్ చుగ్ బొమ్మలు కాదు రఘునందన్, ఈటెల బొమ్మలుంటేనే జనాలు ఓట్లు వేస్తారు. పార్టీ గుర్తు చివరి అంశమే. జీహెచ్‌ఎంసీ ప్లోర్ లీడర్ కావాలని దేవర కరుణాకర్ అనే వ్యక్తి అడిగిఅడిగి చనిపోయాడు. ఇక బీజేపీ పార్టీకి శాశనసభపక్ష నేత లేడనే విషయం నడ్డాకు తెలియదు. ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే తిరిగి ప్రశ్నించారు నడ్డా. బండి సంజయ్ మార్పుపై మీడియాలో వస్తున్న వార్తలన్ని నిజాలే’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.