iDreamPost
android-app
ios-app

రాయలసీమ రణభేరిలోనూ గుంటూరు జిన్నాటవర్ ప్రకంపనలు

  • Published Mar 20, 2022 | 3:18 PM Updated Updated Mar 20, 2022 | 5:51 PM
రాయలసీమ రణభేరిలోనూ గుంటూరు జిన్నాటవర్ ప్రకంపనలు

ఒక్క ఆవు గురించి రాయడం మాత్రమే తెలిసినవాడు వ్యాస రచన పోటీకి వెళితే ఎలా ఉంటుందో భారతీయ జనతా పార్టీ తీరు కూడా అలాగే ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల సాధించిన విజయాల ఉత్సాహంతో శనివారం రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ వైఎస్సార్‌ కడప జిల్లా కడప నగరంలో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్ ప్రసంగం వింటుంటే ఆవు వ్యాసమే గుర్తొచ్చింది. రాయలసీమ వెనుకబాటు తనంపై, సాగు-తాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏర్పాటుచేసిన ఈ సభలో ఆయన మతం ప్రాతిపదికగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

గుంటూరులో జిన్నా టవర్ పేరును ఏపీజే అబ్దుల్ కలామ్ గా మార్చాలని, ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని తొలగించాలని, రాష్ట్రంలో ముస్లిం ఫండమెంటలిజంను అరికట్టాలని డిమాండు చేశారు. ఆత్మకూరులో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసి 43రోజులు జైలులో ఉంచారని ప్రస్తావిస్తూ ఆవేశంగా ప్రసంగించడం ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారా అనిపించింది. రాయలసీమ రణభేరికి, ఈయన ప్రసంగానికి పొంతన లేకుండా సాగింది. పార్టీలో కీలక నాయకుడైన ధియోధర్ సందర్భశుద్ది లేకపోయినా కావాలనే వ్యూహాత్మకంగా ఈ విధంగా మాట్లాడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
ఒకప్పుడు పార్లమెంటులో రెండు సీట్లతో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టడానికి కారణమైన హిందుత్వను ఆ పార్టీ వదులుకోదని, ఏపీలో ఆ దిశగానే ఓట్ల వేట సాగిస్తుందని ధియోధర్ ప్రసంగం ద్వారా అర్థమవుతోంది అంటున్నారు.

రొడ్డకొట్టుడు ప్రసంగాలు.. రొటీన్ ఆరోపణలు..

సభలో ప్రసంగించిన బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పై పలు సందర్భాల్లో చేసిన ఆరోపణలనే కాస్త అటూ ఇటుగా ఏకరువు పెట్టారు. ఇందులో మెజార్టీ శాతం టీడీపీ నేతలు తరచూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై చేసే బురదజల్లుడు బాపతే కావడం గమనార్హం. ఎనిమిదేళ్ల నరేంద్రమోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.80 లక్షల కోట్ల అప్పుతెచ్చిన విషయాన్ని మరచిపోయి.. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు అని విమర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, పేదలను ఆదుకోవడంలేదు. అభివృద్ధి లేదు. పరిశ్రమలు లేవు అంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడారు. బహుశా పేదల సంక్షేమానికి రూ. లక్షల కోట్ల వ్యయంతో పలు పథకాలను అమలు చేస్తున్న విషయం, ఈ ప్రభుత్వం రావడంతోనే సచివాలయాల్లో 1.50 లక్షల పర్మినెంట్, 2.50 లక్షల వలంటీర్ పోస్టులను భర్తీ చేసిన సంగతి ఆయనకు తెలియదనుకోవాలి.

బీజేపీ మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ అయితే రాయలసీమ నుంచి ఇందరు ముఖ్యమంత్రులు పనిచేసినా, మోడీ ప్రధాని అయ్యాకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అనేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి అటు సుప్రీం కొలీజియంకు, ఇటు కేంద్రానికి ఇప్పటివరకు ప్రతిపాదనలు పంపలేదని, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపాదనలు పంపుతుందన్న సోయ లేకుండా ఆయన ఆవేశపడడం విచిత్రం.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఇతర పార్టీ నేతలు ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్టు మాట్లాడేశారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడానికి కారణమైన ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా ల వల్లనే ఇక్కడ గెలుస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు తప్ప రాష్ట్రానికి తాము ఈ మేళ్లు చేశాము అని చెప్పలేక పోయారు. కేంద్రం భారీ ఎత్తున నిధులు ఇస్తోంది అంటూ అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చిన వాటిని.. అక్కడికేదో ఒక్క ఏపీకే నిధులు ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.

తెలుగు బీజేపీ నేతల మూస ప్రసంగాలు..

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ప్రసంగాలు మరీ తెలుగుదేశం పార్టీ వాసన కొట్టాయి. ముఖ్యమంత్రి, మంత్రులు సారా వ్యాపారం చేస్తున్నారని, రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోంది అంటూ తమ పచ్చనోటితో కాషాయ ప్రసంగం కానిచ్చేశారు.

జనసేన నేత సుంకర శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్ పైన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కారు. పోలీసులను కాపలా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని అర్థంలేని విమర్శలు చేయడమే కాక పవన్ రావాలి- జగన్ పోవాలి అని నినాదం ఇచ్చి రణభేరికి వచ్చిన బీజేపీ శ్రేణులు అవాక్కయ్యేలా చేశారు.