iDreamPost
android-app
ios-app

అర్థరాత్రి బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు!

  • Published Feb 26, 2022 | 11:29 AM Updated Updated Feb 26, 2022 | 11:31 AM
అర్థరాత్రి బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు!

రాష్ట్రాలు, జాతీయ చట్టసభల సమావేశాలు అయితే ఉదయం లేదా మధ్యాహ్నం జరగడం సర్వసాధారణం. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత జరగడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కానీ దేశ చరిత్రలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అర్థరాత్రి దాటిన తర్వాత ప్రారంభం కానున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ అరుదైన చరిత్ర సృష్టించనుంది. అర్థరాత్రి దాటిన తర్వాత సమావేశాలు ప్రారంభించాల్సిన అవసరం ఏమిటి?.. ఏమైనా ప్రత్యేక సందర్భం ఉందా? అంటే అటువంటివేవీ లేవు. కానీ బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య కొనసాగుతున్న విభేదాలకు పరాకాష్టగా ఈ అర్థరాత్రి సమావేశాలను చెప్పుకోవచ్చు. ఒక చిన్న టైపింగ్ మిస్టేక్ ను ప్రభుత్వంపై అక్కసు తీర్చుకునేందుకు గవర్నర్ ఉపయోగించుకున్నట్లు కనిపిస్తోంది.

విభేదాల్లో సరికొత్త పరిణామం

బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మధ్య సుదీర్ఘకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్రమయ్యాయి. ప్రెస్మీట్లు, ట్విటర్ల ద్వారా ఇరువురు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు, నిప్పులు కక్కుతున్నారు. సీఎం మమత ఏకంగా గవర్నర్ అధికారిక ట్విటర్ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో మార్చి ఏడో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నరుకు ఒక నోట్ పంపింది. అయితే దాన్ని ఆయన ఆమోదించకుండా వెనక్కి పంపారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం నోట్ పంపితేనే స్పందిస్తానని స్పష్టం చేశారు. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ పేరుతో మరో నోట్ పంపారు. అందులో మార్చి ఏడో తేదీ 2 పీఎం (మధ్యాహ్నం) బదులు 2 ఏఎం (అర్థరాత్రి) అని ఉంది. ఈ పొరపాటును గవర్నర్ గమనించారు. కానీ అలాగే ఆమోదించేశారు. ఈ విషయాన్నే తన ట్విటర్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి ఏడో తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. చరిత్రలో ఇది ప్రత్యేక సందర్భమని, అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గమే ఈ నిర్ణయం తీసుకుందని.. దాన్ని తాను ఆమోదించానని స్పష్టం చేశారు.

గవర్నర్ సరి చేయాల్సింది:స్పీకర్

ఈ పరిణామంపై అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీ స్పందిస్తూ గవర్నరుకు పంపిన నోట్ లో టైపింగు పొరపాటు వల్ల 2 పీఎం బదులు 2 ఏఎం అని పడిందన్నారు. మొదట పంపిన నోటులో సరిగ్గానే ఉన్నా.. రెండో నోటులో తప్పు దొర్లిందన్నారు. దీన్ని గవర్నర్ గమనించారని.. అయితే సరిచేయడానికి ప్రయత్నించకుండా అలాగే ఆమోదించేశారని అన్నారు. దాంతో అర్థరాత్రి సమావేశాలు ప్రారంభించాల్సి వస్తుందన్నారు. అయితే గవర్నర్ కార్యాలయం వివరణ వేరేగా ఉంది. సమయం తప్పును గవర్నర్ గమనించి దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని భావించి ఫోన్ చేశారు. అయితే చీఫ్ సెక్రటరీ సకాలంలో స్పందించకపోవడంతో.. ఆ నోటును యథాతథంగా ఆమోదించారని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఏమైనా గవర్నర్ నోటిఫై చేసిన విధంగా అర్థరాత్రి అసెంబ్లీ సమావేశం జరిగితే చరిత్రలో అదో రికార్డుగా నిలిచిపోతుంది.