iDreamPost
android-app
ios-app

అసలు ఎవరీ బర్రెలక్క.. సోషల్ మీడియాలో ఎందుకంత క్రేజ్?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాదు.. సోషల్ మీడియాలో కూడా నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట బర్రెలక్క శిరీషా వైరల్ గా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాదు.. సోషల్ మీడియాలో కూడా నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట బర్రెలక్క శిరీషా వైరల్ గా మారింది.

అసలు ఎవరీ బర్రెలక్క.. సోషల్ మీడియాలో ఎందుకంత క్రేజ్?

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మా గుర్తుకే మీ ఓటు అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ ప్రచారాల జోరులో ఒక యువతి పేరు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. శిరీషా అలియాస్ బర్రెలక్క. బర్రెల మీద రీల్స్ చేసి శిరీషా ఎంతో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను అందరూ బర్రెలక్క అని పిలవడం మొదలు పెట్టారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ పేరు కూడా బర్రెలక్కగా మార్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిరీషా ఫుల్ వైరల్ అవుతోంది. అసలు ఆమెకు ఎందుకు అంత క్రేజ్ అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

శిరీషా అప్పుడు చేసిన కొన్ని ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వాడుకున్నారు. అలా కొందరు ఆమె రీల్స్ ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోవడంతో.. శిరీషాకు లీగల్ గా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా శిరీషా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ప్రచారం కూడా జోరుగా సాగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బర్రెలక్కకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. స్వతహాగానే సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ కావడంతో ఆమె పోస్టులకు మంచి స్పందన లభిస్తోంది. అయితే స్థానికంగా, నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియరాలేదు.

నెట్టింట వచ్చిన స్పందనను ఆమె ఓట్లుగా మార్చుకోగలుగుతుందా? తన ప్రచారంతో ప్రభావం చూపించి విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం. కొల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థుల విషయానికి వస్తే.. BRS తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన.. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 12,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ టర్మ్ కూడా బీఆర్ఎస్ తరఫున బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరి అదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇంక బీజేపీ తరఫున సుధాకర్రావు పోటీలో ఉన్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కన పెడితే స్వతంత్ర అభ్యర్థిగా శిరీషా అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోంది. ఇటీవల ఆమె ప్రచారంలో ఉండగా ఆమె సోదరుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడి ఘటనను పలువురు ప్రముఖులు ఖండించారు. ఆ దాడి తర్వాత బర్రెల్కకకు నెట్టింట సింపథీ లభించింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ లాంటి వాళ్లు కూడా ఆమెకు మద్దతు తెలిపారు. అయితే ఈ మద్దతు, సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్ ను ఓట్లుగా మలుచుకోవడంలో బర్రెలక్క ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.