Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, సీఐడీ కస్టడీ వంటి అంశాలన్ని సంచలనంగా మారాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగు రాష్ట్రాల మజ్లిస్ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. ఏపీలో చాలా మంచి పాలన అందిస్తున్నారని ప్రశంసించారు అసదుద్దీన్.
కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని.. ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దంటూ కోరారు అసదుద్దీన్. అంతేకాక ఏపీలో ఎన్నికల్లో పోటీ విషయంపైనా అసదుద్దీన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు అసదుద్దీన్. మజ్లిస్ పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న ఎమ్మెల్యేలను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని అసదుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు. తమతో స్నేహపూర్వకంగా ఉంటే తామూ చేయందిస్తామని, కానీ మైత్రి పేరుతో వెన్నుపోటు పొడిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని అసద్ స్పష్టం చేశారు.
ఈ సమావేశం సందర్భంగా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి పరిపాలన అద్భుతంగా సాగుతోందని.. రాష్ట్రంలో ఎలాంటి మతకలహాలకు చోటు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అసదుద్దీన్ ప్రశంసించారు.