iDreamPost
android-app
ios-app

ఆప్‌ వారందరినీ కలవరపాటుకు గురిచేస్తోందా..?

ఆప్‌ వారందరినీ కలవరపాటుకు గురిచేస్తోందా..?

దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గురించి నిన్నటివరకు దేశంలోని ఇతర రాష్ట్రాలలోని పార్టీలు ఆలోచించలేదు. అయితే పంజాబ్‌లో ఆప్‌ సాధించిన విజయం తర్వాత.. ఆయా పార్టీలలో కలవరం మొదలైందా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఫలితాల తర్వాత ఆయా పార్టీలు గుమ్మనంగా ఉండడం ఈ సందేహాలకు బలం చేకూరుతోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా ఏదైనా రాష్ట్రంలో విజయం సాధిస్తే.. ఇతర రాష్ట్రాలలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణం. 2015, 2020 ఎన్నికల్లో ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆయా పార్టీల నుంచి అభినందనలు అందుకున్నారు.

అయితే పంజాబ్‌ విజయంపై ఆప్‌ అధినేతకు శుభాకాంక్షలు కరువయ్యాయి. పంజాబ్‌లోని శిరోమణి అకాళిదల్, కాంగ్రెస్‌ పార్టీలు మినహా.. కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సహా ఆయా రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరూ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపకపోవడం గమనార్హం.

ఆయా నేతలు ఇలా మౌనంగా ఉండడానికి ఆప్‌ ప్రయాణమే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో పుట్టిన పార్టీ పదేళ్ల తర్వాత ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లో విజయవంతమైంది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆప్‌.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పోటీ చేసింది. గోవాలో రెండు సీట్లను గెలుచుకుంది. మిగిలిన మూడు రాష్ట్రాలలో విజయం అందుకోకపోయినా.. చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఢిల్లీ బయట.. కూడా అధికారం సాధించగలమనే నమ్మకం పంజాబ్‌ విజయం తర్వాత కేజ్రీవాల్‌లో ఏర్పడింది.

ఈ నమ్మకంతోనే ఆయన ఈ ఏడాది ఆఖరులో జరగబోయే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో పని ప్రారంభించారు. ఇలా సాగుతున్న ఆప్‌ ప్రయాణం.. రాబోయే రోజుల్లో తమ వద్దకు కూడా వస్తుందనే భావన ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. దేశ చరిత్రలో ఇప్పటివరకు అన్ని పార్టీల పుట్టుక, రాజకీయం, ప్రయాణం ఒక ఎత్తు అయితే.. ఆప్‌ ప్రయాణం మరో ఎత్తు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తనదైన శైలిలో ఆప్‌ ప్రజల్లోకి వెళుతోంది.

అలవిగాని హామీలు ఇవ్వకపోవడం,ప్రజల కనీస అవసరాలపై దృష్టి పెట్టడం, విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు దూరంగా ఉండడం, అవినీతి మచ్చలేని చరిత్ర, ఢిల్లీలో ఆప్‌ పాలన.. ఇవన్నీ ఆ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆప్‌ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎంతమేరకు విస్తరిస్తోందో గానీ.. ఆప్‌ ఎప్పటికైనా తమకు ప్రత్యర్థి అవుతుందనే భావనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారని పంజాబ్‌ ఎన్నికల ఫలితాలపై వారందరూ మౌనంగా ఉండడం ద్వారా అర్థం చేసుకోవచ్చు.