Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా చర్చసాగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. కొత్త జిల్లాలలో ఉగాది నుంచి పాలన ప్రారంభం కాబోతున్న తరుణంలో జిల్లాకు ఒక మంత్రి ఉండేలా మంత్రివర్గ కూర్పు ఉంటుందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అందరికీ అవకాశం కల్పించేందుకు, అదే సమయంలో సామాజికవర్గ సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండడంతో ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించే వారికి మళ్లీ ప్రభుత్వంలో తొలి దఫాలోనే అవకాశం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఉగాదికి కొత్త మంత్రుల రాక లాంఛనమే.
మంతివర్గంలో అన్ని సామాజికవర్గాలకు స్థానం కల్పించేందుకు సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల సేవలు అవసరం కావడంతో కొంతమందిని కొనసాగించే అవకాశం ఉంది. మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయంలో చెప్పినట్లు దాదాపు 20 మంది కొత్త వారికి తాజాగా అవకాశం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల అకాలమరణం పొందారు. వీరిలో సీనియారిటీ దృష్ట్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగించే అవకాశం ఉంది.కొత్తగా అవకాశం దక్కేవారిలో అనంతపురం జిల్లా నుంచి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందున్నారు.తిరుపతి,బద్వేల్ ఉపఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు ప్రకాష్ రెడ్డి విజయవంతంగా నిర్వహించటం, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ లెక్కలను దెబ్బకొట్టి వైసీపీకి భారీ విజయం సాధించటం ప్రకాష్ రెడ్డికి సానుకూల అంశాలు. మరో వైపు సీఎం మానస పుత్రిక “జగనన్న కాలనీలు” పులివెందులలో సహా రాష్ట్ర వ్యాప్తంగా కట్టిస్తుండటం కూడా కలిసొచ్చే అంశం.
కర్నూల్ జిల్లా నుంచి శిల్పా కుటుంబంలో చక్రపాణి రెడ్డికి అవకాశం దక్కవచ్చు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. రేసులో చిత్తూరు జిల్లా నుంచి రోజా, భూమాన కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు. మొత్తంగా కేబినెట్ లో రెడ్డి సామాజికవర్గానికి ప్రస్తుతం మాదిరిగానే నలుగురికి లేదా ఐదుగురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
కమ్మ సామాజికవర్గంలో కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్‌రావు, అన్నాబత్తుని శివకుమార్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజికవర్గ సమీకరణాలతోపాటు, టీడీపీని గట్గిగా ఎదుర్కొనే నానిని కొనసాగించే అవకాశం ఉంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజకీయ నేపథ్యం, దేవినేని ఉమాను ఓడించిన చరిత్ర దృష్ట్యా ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉంది.
కాపు సామాజికవర్గం నుంచి పేర్ని, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు మంత్రులుగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కురసాల కన్నబాబు స్థానంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు అవకాశం దక్కుతుందనే వాదన బలంగా ఉంది. జక్కంపూడి రాజా కూడా రేసులో ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్‌నాథ్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాకు నుంచి సామినేని ఉదయభానులు కాపు సామాజికవర్గం నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాయలసీమలోని బలిజలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే.. సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య పేరును పరిశీలించే అవకాశం ఉంది.
బీసీలకు అవకాశం ఇవ్వడంపై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసే అవకాశం ఉంది. మొదటి విడతలో అవకాశం దక్కిన సామాజికవర్గాలు పోను.. ఈసారి ఇప్పటి వరకు అవకాశం లభించని బీసీ సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీల్లో రాయలసీమ నుంచి జయరాములు (బోయ), శంకర నారాయణ (కురబ)లకు మంత్రులుగా ఉన్నారు. కర్నూలు మేయర్‌గా బోయ సామాజికవర్గానికి చెందిన బీవై రామయ్య, అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి గిరిజమ్మ(బోయ)కు ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి రాయలసీమేతర జిల్లాల బీసీ నేతలకు ఇచ్చే అవకాశం ఉంది. సంఖ్యాఅపరంగా పెద్ద కులాలు అయిన యాదవ్, శెట్టిబలిజ, తూర్పుకాపులకు మళ్లీ అవకాశం దక్కే సూచనలున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనిల్‌కుమార్ యాదవ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ, సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావులు బలమైన పోటీదారులుగా ఉన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి ఈసారి కూడా అవకాశం లభించే పరిస్థితులు ఉన్నాయి. అదే జరిగితే రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోష్ స్థానంలో మంత్రి పదవి పొందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణను కొనసాగించే అవకాశం ఉంది. శెట్టిబలిజల్లో వేణు ఒక్కడే ఉండడం అయనకు కలిసి వచ్చే అంశం. మత్య్సకార సామాజికవర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ స్థానంలో వచ్చిన సీదిరి అప్పల రాజును కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. విద్యావంతులు కావడం, ప్రభుత్వ వాయిస్‌ను బలంగా వినిపిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. ఆ సామాజికవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఉన్నా.. కోనసీమ జిల్లాలో ఎస్సీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సతీష్‌కు ఎంతమేరకు అవకాశం ఉంటుందో చూడాలి.
మైనారిటీల నుంచి ప్రస్తుతం అంజాద్ భాష ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ స్థానం కోసం కర్నూలు సిటీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాష పోటీ పడుతున్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు రేసులో ఉన్న నేపథ్యంలో మైనారిటీ కోటాలో నవాజ్ బాషకు అవకాశం లభించకపోవచ్చు. ప్రాంతం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు అవకాశం లభించొచ్చు. వీరితోపాటు మాజీ పోలీస్ అధికారి హిందూపూర్ నుంచి ఓడిపోయిన ఇక్బాల్ ను కూడా హోమ్ మంత్రిగా పరిశీలించే అవకాశం ఉంది.
ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, తానేటి వనితలు మంత్రులుగా ఉన్నారు. వీరి స్థానాల్లో దాదాపు అందరూ కొత్తవారు వచ్చే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల నుంచి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేన్ రాజుకు మండలి చైర్మన్ పదవి ఇచ్చిన నేపథ్యం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటే పినిపే విశ్వరూప్‌ను కొనసాగించవచ్చు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈసారి అవకాశం దక్కుతుందనే సంకేతాలు బలంగా ఉన్నాయి. సీఎం జగన్‌తో బాబూరావు ఆది నుంచి నడిచారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
కృష్ణా జిల్లాలో మొండితోక జగన్‌మోహన్ రావు రేసులో ఉన్నారు. అయితే ఆయన సోదరుడు మొండితోక అరుణ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయనకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, కర్నూలు జిల్లా నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, అనంతపురం జిల్లా నుంచి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నెల్లూరు జిల్లా నుంచి కిలివేటి సంజీవయ్యలు రేసులు ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
ఎస్టీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన పుష్పశ్రీ వాణి ఉన్నారు. ఈ స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విశ్వసరాయి కళావతికి అవకాశం ఉండొచ్చు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్.. అక్కను తన పక్కన కూర్చొపెట్టుకుంటానని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా రేసులో ఉన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి బాలరాజు వైఎస్ జగన్ వెంట నడిచారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ బాటలో పయనించారు. సీనియర్ నేత రాజన్న దొర కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇతర సామాజికవర్గాల్లో ఈసారి బ్రాహ్మణ సామాజికవర్గానికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. మొదటి దశలో వైశ్యులకు అవకాశం ఇవ్వగా.. ఈసారి బ్రాహ్మణులకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఈ కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిలు రేసులో ఉన్నారు.
శ్రీకాకుళం నుంచి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరును పరిశీలించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. కొత్త వారికి మంత్రి పదవికి దక్కే ఛాన్స్ ఉంది. క్షత్రియ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం చెరుకూరి శ్రీరంగనాథరాజు ఉన్నారు. క్షత్రియులకు ఈ సారి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటే.. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేరును పరిశీలిస్తారు. ప్రసాదరాజు ఆది నుంచి జగన్‌తోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో నరసాపురం కాదని ఆచంట టిక్కెట్ ఇచ్చినా.. జగన్ ఆదేశాలకు పాటిస్టూ పోటీ చేశారు. మొత్తంగా మంత్రి యోగం ఎవరికి ఉందో ఈ నెలాఖరులోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.