iDreamPost
android-app
ios-app

వివేకానంద కేసులో టీడీపీ లక్ష్యం అదే..

  • Published Feb 23, 2022 | 6:34 PM Updated Updated Feb 24, 2022 | 12:42 PM
వివేకానంద కేసులో టీడీపీ లక్ష్యం అదే..

వైఎస్సార్ ని విమర్శించేందుకు అదే పద్ధతి వాడారు. ఆ తర్వాత జగన్ ని నిందించేందుకు అవే విమర్శలు చేశారు. రాజారెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఎవరినీ వదలకుండా ఫ్యాక్షనిస్టుల ముద్ర వేసి ప్రయోజనం పొందాలని చూశారు. కొంత మేరకు అది ఉపయోగపడి, ఓవర్గం ప్రజలను భ్రమల్లో పెట్టగలిగారు. కానీ సామాన్యులు మాత్రం ఎల్లకాలం అలాంటి కహానీలను నమ్మకపోవడంతో చివరకు వైఎస్సార్ సీఎం అయ్యారు. ఆయన హయంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం కూడా అదుపు చేయడంలో సక్సెస్ సాధించారు. స్వయంగా ఆయనే అనేక మందిని ఫ్యాక్షన్ నుంచి బయటపడేసేందుకు తీసుకున్న చొరవ రాయలసీమ భవిష్యత్తుని మార్చేందుకు ఎంతగానో దోహదపడింది. అయినప్పటికీ ఫ్యాక్షనిస్టు ముద్ర మాత్రం జగన్ మీద కొనసాగించడంలో పచ్చ మీడియా, దాని యజమాని టీడీపీ మాత్రం శతవిధాలా ప్రయత్నించి అర్బన్ ప్రజలను కొంత అయోమయంలో ముంచారు.

జగన్ అధికారంలోకి వస్తే కడప ముఠాలు రెచ్చిపోతాయంటూ వార్తలు కూడా అచ్చేసి అడ్డందిడ్డంగా వ్యవహరించారు. కానీ గడిచిన మూడేళ్ల పాలనలో ఏపీలో రౌడీయిజం అదుపులోకి రావడం, హత్యలు తగ్గుముఖం పట్టడం, మొత్తం క్రైమ్ రేట్ సైతం అదుపులో ఉండడం వారెవరికీ జీర్ణం కాని అంశాలు. అందుకే మరోసారి జగన్ ని బద్నాం చేసేందుకు ఆయన కుటుంబం మీద బురదజల్లేందుకు పూనుకున్నారు.. ఇప్పటికే జగన్ చుట్టూ కులం, మతం కోణంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. టీడీపీ దుష్ప్రచారం జనాలు కూడా గ్రహించారు. దాంతో ఆపార్టీ కోలుకోవడం లేదు సరికదా మరింత పతనమవుతోందని ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి.

తమకు తెలిసిన ఏకైక విద్య నిందలు వేయడం, వాస్తవాలను కప్పిపుచ్చడమే కాబట్టి ఇప్పుడు మరోసారి వివేకానందరెడ్డి హత్యను ఆధారంగా చేసుకుని జగన్ మీద బురద జల్లే పనికి పూనుకుంటున్నారు. వాస్తవానికి సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలు కూడా అత్యుత్సాహంతో ఉన్నట్టుగా అనేక అంశాలు చాటిచెబుతున్నాయి. ఉదాహరణకు వివేకా హత్య కోసం కదిరి వెళ్లి రూ. 400 కి గొడ్డలి కొనుగోలు చేసినట్టు ఓ సాక్ష్యం ప్రస్తావించారు. కానీ ఏదయినా హత్య గానీ, మరో నేరానికి పాల్పడాలనే లక్ష్యంతో ఉన్న వాళ్లు కొత్తగా గొడ్డలి కొని, అది కూడా కదిరి వెళ్లి మరీ తెచ్చి చంపుతారా అంటే అతిశయోక్తే. అయినా సీబీఐ తన దగ్గర ఉన్న సాక్ష్యాలంటూ వాటిని చూపుతోంది. పచ్చమీడియాలో నిత్యం వాటిని వల్లిస్తూ ప్రజలను నమ్మించవచ్చని భావిస్తోంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న విచారణ ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. సీబీఐ తీరు మీద, అందులోనూ డీఎస్పీ వైఖరి మీద ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటు మళ్లుతుందో తెలియకుండానే టీడీపీ నేతలు జగన్ మీద దాడికి పూనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అది వారి నైజాన్ని చాటుతుందని చెప్పాల్సి ఉంటుది. రాజకీయంగా కడప, పులివెందుల ప్రజలు టీడీపీ ప్రచారాన్ని విశ్వసించే అవకాశం లేదు. కానీ దూరంగా ఉండే జనాలను నమ్మించవచ్చన్నది టీడీపీ అసలు లక్ష్యం. ఇతర ప్రాంతాల వారికి అక్కడ ఏం జరుగుతుందన్నది తెలియదు కాబట్టి, అబద్ధాల ద్వారా అందరినీ బుట్టలో పడేయవచ్చనే టీడీపీ అత్యాశగా ఉంది. ఏమయినా ఇలాంటి యత్నాలు రాజకీయంగా ప్రత్యర్థి వ్యక్తిత్వం మీద దాడి కోసం చేస్తున్నవిగానే భావించాలి. వాటి ద్వారా టీడీపీ ఆశించిన పలితాలు దక్కవనే చెప్పాలి.