iDreamPost
android-app
ios-app

పరిషత్‌లోనూ ఫ్యానుదే హవా – 13 జిల్లాల ఫలితాలు

పరిషత్‌లోనూ ఫ్యానుదే హవా – 13 జిల్లాల ఫలితాలు

సాధారణ ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ… ఆ ఉరవడిని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నిక ఏదైనా సరే తనకు ఎదురేలేదని నిరూపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి ఆమడదూరంలో ఉంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన వైసీపీ.. పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే స్పీడ్‌ను కొనసాగించింది. అత్యధిక జడ్పీటీసీ స్థానాలు గెలుచుకుని, 13 జిల్లాల జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. పలు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా.. మరికొన్ని జిల్లాల్లో టీడీపీని ఒక స్థానానికే పరిమితం చేసింది.

రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాలతో 19 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 641 గాను 129 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కించి, ఫలితాలు వెల్లడించారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. ఫలితాల వెల్లడికి సమయం పడుతోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు వరకు.. ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 604 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. టీడీపీ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు ఆరుచోట్ల గెలిచారు.

Also Read : ఎన్నికలు – బహిష్కరణ- బాబు గారి కొత్త సూత్రీకరణ

అన్ని జిల్లాలు వైసీపీవే..

13 జిల్లా పరిషత్‌లను వైసీపీ భారీ మోజారిటీతో కైవసం చేసుకుంది. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ప్రకాశంలో 55 స్థానాలకు 55, శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లాలో 46కి 46, కర్నూలు జిల్లాలో 53 స్థానాలకు 53 వైసీపీ గెలిచింది. విజయనగరం జిల్లాలో 34 స్థానాలనూ ౖÐð సీపీ కైవసం చేసుకుంది. ఈ నాలుగు జిల్లాలో ప్రతిపక్షమే లేకుండా పోయింది.

పలు జిల్లాలో ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. వైఎస్సార్‌ కడపలో 50 స్థానాలకు గాను 49 చోట్ల వైసీపీ, టీడీపీ ఒక చోట నెగ్గాయి. అనంతపురం జిల్లాలో 63 సీట్లకు గాను వైసీపీ 61 చోట్ల, టీడీపీ ఒక చోట, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. శ్రీకాకుళంలో జిల్లాలో 38 జడ్పీటీసీలకు గాను 37 చోట్ల వైసీపీ. ఒక చోట టీడీపీ గెలిచాయి.

ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో 65 స్థానాలకు గాను 63 చోట్ల వైసీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జడ్పీటీసీలకు గాను వైసీపీ 30, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాలో 61 సీట్లకు గాను వైసీపీ 48 చోట్ల నెగ్గగా.. టీడీపీ ఒకచోట గెలిచింది. కృష్ణా జిల్లాలో 46 సీట్లకు గాను వైసీపీ 41, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. గుంటూరు జిల్లాలో 54 స్థానాలకు గాను 53 చోట్ల వైసీపీ గెలిచింది. విశాఖలో 39 స్థానాలకు గాను 35 చోట్ల వైసీపీ గెలవగా.. టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క చోట గెలిచారు.

Also Read : పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?