ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నమ్మితే అండగా నిలుస్తారని మరో మారు నిరూపించుకున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ పాలన నచ్చి పార్టీలో చేరిన నేతకు కీలక పదవి దక్కింది. తాజాగా వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం తరఫున కొత్తగా మరో సలహాదారు నియామకం జరిగింది. రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా షేక్ మహ్మద్ జియావుద్దీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జియావుద్దీన్ నియామకంపై మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జియావుద్దీన్ ప్రభుత్వ సలహాదారు పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అంతేకాదు, నెల వారీ వేతనం, అదనపు భత్యాలను జియావుద్దీన్ పొందుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.
జియావుద్దీన్ మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత లాల్‌జాన్ భాషా సోదరుడు. 1995, 99లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో ఆయన్ను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో పాటు ఆయన జగన్ పాలనకు ఆకర్షితులు కావడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు విధానాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు అప్పట్లో ఆయన బహిరంగ లేఖ రాశారు. పార్టీ కోసం, రాజకీయంగా మీ ఎదుగుదల కోసం తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకున్నారని ఆ లేఖలో విమర్శించారు.
బాషా మరణించిన తర్వాత రాజకీయంగా తమను ఇబ్బందులకు గురి చేశారని, ప్రవర్తనలో ఏనాటికైనా మార్పు వస్తుందని ఇన్నాళ్లు ఎదురు చూశాం కానీ ఫలితం లేకుండా పోయిందని లేఖలో విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్న మీ తీరు తమతో సహా పార్టీలో వ్యక్తిత్వం కలిగిన వారికి మొదటి నుంచి కూడా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసమైన సందర్బంలో మతాల మధ్య విద్వేషాలు, రఘురామకృష్ణ రాజు అరెస్ట్ విషయంలో కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు గుప్పించారు. ఇక ప్రభుత్వ సలహాదారుగా తనను నియమించిన సీఎం జగన్ కు జియావుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మౌనం వెనక కారణం ?