iDreamPost
android-app
ios-app

2007లో నేనే కెప్టెన్ అవ్వాలి.. ధోనీపై, కెప్టెన్సీపై యువీ సంచలన వ్యాఖ్యలు..

  • Published May 08, 2022 | 7:13 PM Updated Updated May 08, 2022 | 7:13 PM
2007లో నేనే కెప్టెన్ అవ్వాలి.. ధోనీపై, కెప్టెన్సీపై యువీ సంచలన వ్యాఖ్యలు..

యువరాజ్ సింగ్.. ఒకప్పుడు భారత క్రికెట్ లో ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్నాడు. టీమ్‌ఇండియా అందుకున్న రెండు ప్రపంచకప్‌లలోను అద్భుతమైన ఆతని కనబరిచి విజయానికి తోడ్పడ్డాడు. భారత జట్టులో విలువైన, సీనియర్ ఆటగాళ్లలో యువీ కూడా ఒకరు. కానీ యువీ భారత జట్టుకి కెప్టెన్ అవ్వకపోవడం ఆశ్చర్యకర, అంతు చిక్కని విషయమే. గతంలోనే యువీ తండ్రి అతనికి కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదో అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా యువరాజ్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో 2007లోనే నేను టీం ఇండియాకి కెప్టెన్ అవ్వాల్సింది అంటూ ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. టీమ్‌ఇండియాకు నేను 2007 లోనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ అదే టైంలో సచిన్‌, కోచ్ ఛాపెల్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ వివాదంలో నేను సచిన్‌ వైపే ఉన్నాను. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను కాకుండా ఇంకెవరినైనా కెప్టెన్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. 2007 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాం. ఆ టూర్లో ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉండగా నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాను. ఆ తర్వాత నేనే కెప్టెన్‌ అవ్వాలి. కానీ అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అంతేకాక వైస్‌ కెప్టెన్‌గా కూడా నన్ను తొలగించారు.

అయితే ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం అయి నేను కూడా అతనికే సపోర్ట్ ఇచ్చాను. ఆ తర్వాత నేను వరుసగా గాయాలపాలవ్వడం, నాకు క్యాన్సర్ రావడంతో జట్టుకి, ఆటకి దూరమయ్యాను. ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా ఎక్కువ కాలం కొనసాగను అని తర్వాత అర్థమైంది. ఏం జరిగినా మన మంచికే అనుకున్నాను. అయితే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం అని భావిస్తాను అని తెలిపారు.