iDreamPost
android-app
ios-app

షర్మిల దీక్ష భగ్నం, అరెస్ట్

షర్మిల దీక్ష  భగ్నం, అరెస్ట్

తెలంగాణాలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తాను అంటూ దీక్షలకు దిగుతున్న తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాసేపటి క్రితం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ లో షర్మిల నేడు దీక్షకు దిగే ప్రయత్నం చేసారు. నిరుద్యోగి రవీంద్ర నాయక్ ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఆయన కుటుంబాన్ని నేడు షర్మిల పరామర్శించారు.

కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఆ తర్వాత బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద దీక్ష చేయాలని భావించారు. అయితే అందుకు పోలీసులు ఆమెకు అనుమతి నిరాకరించారు. అయినా సరే షర్మిల నగరంలోని బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేసారు. పోలీసులు అనుమతి నిరాకరించినా సరే దీక్ష చేస్తాను అని ఆమె ప్రకటించడం తో ఆమె పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీనితో సీరియస్ అయిన పోలీసులు తాము వద్దన్నా సరే దీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాము ముందే అనుమతి అడిగినా సరే ఎందుకు అనుమతించలేదు అని పోలీసులను నిలదీశారు.

ఆ తర్వాత అక్కడి నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు బయల్దేరి వెళ్ళారు షర్మిల. అక్కడ పోలీసులు ఆమెను అడ్డగించగా కార్యకర్తలతో కలిసి షర్మిల దీక్షకు దిగారు. దీనితో సీరియస్ అయిన పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అక్కడి నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా భారీగా కార్యకర్తలు రావడంతో షర్మిలను పోలీసులు వెంటనే ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌ కు తరలించాలని భావించారు. కాని అక్కడికి కూడా కార్యకర్తలు భారీగా రావడంతో ఆమెను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా లోటస్ పాండ్ కు తరలించారు.

Also Read : తెలంగాణ లో “వైట్” వార్…!