iDreamPost
android-app
ios-app

బీజేపీలోకి గ‌ట్టు శ్రీ‌కాంత్‌

బీజేపీలోకి గ‌ట్టు శ్రీ‌కాంత్‌

వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. వైసీపీ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషకరమైన విషయమని బండి సంజయ్ అన్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఏప్రిల్ 3, 2021న వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలోనే తాను జాతీయ పార్టీలో చేరి.. 2023 ఎన్నికలలో హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.

జ‌గ‌న్ వ‌ల్లే ఈ స్థాయికి…

నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఏప్రిల్ లో వైసీపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా మాట్లాడుతూ… 2007 నుంచి తాను వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నానని, పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ బాధ్యతలతోపాటు జిల్లా ఇన్చార్జిగా, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇలా అవకాశాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు తానెప్పుడూ జగన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీని వీడాలని బాధతో నిర్ణయం తీసుకున్నానని, ఈ రోజు తనకు దుర్దినమేనని ఆ సంద‌ర్భంగా ఆయన అభివర్ణించారు. అద్భుతమైన పాలనతో ఏపీని ప్రగతిపథంలో ఉంచిన జగన్ మోహన్ రెడ్డికి భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అని గట్టు భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీలో చేరిన గ‌ట్టు తొలుత ష‌ర్మిల పార్టీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

బీజేపీ అంటే కేసీఆర్ కు భ‌యం : బండి

గ‌ట్టు చేరిన సంద‌ర్భంగా బండి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు చాలామంది బీజేపీలో చేరుతున్నరు. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. కేసీఆర్ నీ చరిత్ర తెరమరుగు చేస్తాం. నీ రాజకీయ భవిష్యత్‌కు తెలంగాణ ప్రజలు సమాధి కడతారు. నీ సంగతేందో తేలుస్తం. నిజాం పాలనలో జరిగిన అరాచకాలే.. కేసీఆర్ పాలనలోనూ జరుగుతున్నయి. హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నడు. కేసీఆర్ ఒక పెద్ద మోసాగాడు. ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకువస్తున్నయి. దళితులు, బీసీలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, గొర్లు, బర్లు, పోడు భూములు గుర్తుకు వస్తయి. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కుర్చీ వేసుకుని కూర్చుంట అన్నడు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల మీదకు ఫారెస్ట్ అధికారులను ప్రభుత్వమే పంపుతుంది. ఫారెస్ట్ అధికారులతో గిరిజనులపై దాడి చేయిస్తోంది. ఆ దాడిని ప్రజాప్రతినిదులు ఆపినట్లు బిల్డప్ ఇస్తరు. హుజూరాబాద్‌లో తలకాయ కిందికి.. కాళ్ళు పైకి పెట్టినా కేసీఆర్ గెలవడు. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధి కూడా దొరుకతలేడు. టీఆర్ఎస్‌కు అక్కడ డిపాజిట్ కూడా రాదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని త్వరలోనే ఉద్యమం చేస్తాం’ అని అన్నారు.