Idream media
Idream media
దేశంలోనే నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరంగా అధిక ప్రాధాన్యమే దక్కుతోంది. గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను పొందిన వైసీపీక అందుకనుగుణంగానే కేంద్రం తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పాలనా విధానాలతో దేశ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ పరిణామాలన్నీ కేంద్రంలో వైసీపీకి పట్టు పెరిగేలా చేస్తున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు సభ్యులు రాజ్యసభకు కొత్తగా ఎన్నిక కావడంతో ఆ పార్టీ సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 6గురు సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుంది. జగన్ ప్రతిపాదనలకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని పదవీ కాలం మరి కొంత కాలం పొడిగించడమే. ఇప్పటికే ఓ మూడు నెలల పాటు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. దీంతో ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు సానుకూలంగానే స్పందించిన మోదీ సర్కారు నీలం పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించేందుకు సమ్మతి తెలిపింది. అలాగే లాక్ డౌన్ కాలంలోను, అనంతరం కూడా జగన్ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన తీరు కూడా వైసీపీకి కలిసొచ్చింది.
కీలక పదవి మరో సంకేతం
ఈ పరిణామాల మధ్య వైసీపీకి మరో కీలక పదవి లభించింది. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో చోటు దక్కింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులు అయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటేరియట్ కొద్ది రోజుల క్రితం ఓ బులెటిన్‌ను విడుదల చేశారు. విజయసాయి రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మల్లికార్జున ఖర్గె, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, శివ్ ప్రతాప్ శుక్షాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి ఆరుమంది సభ్యుల బలం ఉంది. ఇదివరకే విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యులుగా కొనసాగుతున్నారు. జూన్ 19వ తేదీన నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నుంచి మరో నలుగురు ఎన్నికయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ వైసీపీ సభ్యులుగా ఉన్నారు. వైసీపీకి ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి చెందిన సభ్యుడికి బీఏసీలో చోటు కల్పించారు. కేంద్రంలో వైసీపీకి ప్రాధాన్యం పెరుగుతుండడం రాష్ట్ర అభివృద్ధికి శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు.