iDreamPost
android-app
ios-app

గ్రామీణ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌

గ్రామీణ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌

దేశంలో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు, నగరాలకు వెళుతున్నారు. జ్వరాలు, సీజనల్‌ వ్యాధులకు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులే గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ఇందులో మినహాయింపు లేదు. స్వాతంత్ర వచ్చి ఏడు పదులు దాటినా.. ఇప్పటికీ గ్రామీణ వైద్య సేవల్లో ఎలాంటి మార్పులేదు. అయితే ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో మారబోతోంది. మరో ఏడాదిలో గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ రెండు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసి అమలు పరుస్తున్నారు.

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు..

ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు అన్నీ పట్టణాలలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన గ్రామీణ ప్రజలు ఆయా ఆస్పత్రులకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. పైగా ఆయా ఆరోగ్య కేంద్రాలకు పట్టణ ప్రజలు విరివిగా వెళుతుంటారు. ఇక పట్టణాలు, నగరాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు అదనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు అనే వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల పక్కన అవసరమైన చోట.. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల పక్కన 10,032 విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు తలపెట్టింది.

శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది..

ప్రతి పంచాయతీ పరిధిలోని ఏర్పాటు చేయబోయే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో ముగ్గురు వైద్య సిబ్బందిని నియమించబోతున్నారు. మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ), ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. వీరు స్థానికంగానే నివాసం ఉంటారు. ప్రజలకు జ్వరం, ఇతర జబ్బులకు చికిత్స అందిస్తారు. మెరుగైన చికిత్స అవసరమైతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. ప్రతి క్లినిక్‌లో ముగ్గురు చొప్పన మొత్తం 30,096 మంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించబోతున్నారు. తాజాగా అవసరమైన 7,000 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పక్కా భవనాలు..

గ్రామ సచివాలయం పక్కనే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌కు పక్కా భవనం నిర్మిస్తున్నారు. అందులో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కొక్క భవనాన్ని దాదాపు 22 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేశారు. పలు గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల శంకుస్థాపనలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది మార్చి లోపు అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసి, వైద్య సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది.

అదనంగా వైద్యులు..

మైదాన ప్రాంతాలలోని మండలాల్లో రెండు, గిరిజన మండలాల్లో మూడు చొప్పన ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రులు ఉండాలనే లక్ష్యంతో.. వైసీపీ సర్కార్‌ కొత్తగా 170 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మండలంలో ఒకే ఒక్క ఆరోగ్య కేంద్రం ఉన్న చోట.. అదనంగా మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. అంతేకాకుండా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఒక వైద్యుడు మాత్రమే ఉండగా.. ఇకపై ఇద్దరు వైద్యులు సేవలందించబోతున్నారు. వీరు తరచూ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను సందర్శించి ప్రజలకు వైద్య సేవలు అందించేలా వైసీపీ ప్రభుత్వం రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసింది. కరోనా ప్రభావం తగ్గి.. మునుపటిలాగే రోజు వారీ కార్యకలాపాలు ప్రారంభమైతే.. మరో ఏడాదిలో గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయి.