iDreamPost
iDreamPost
దేశంలో చాలా గ్రామాల్లోని ప్రజలు ఆర్ఎంపీ (RMP) వైద్యులు అందించే సేవలతోనే బ్రతికేస్తున్నారు. లక్షల ఆవాసాల ప్రజలు ఈ ఆర్ఎంపీల సేవలకు కూడా నోచుకోలేదు. సహజంగా వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, వంటినొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు వంటి వాటికి చాలా మంది ప్రజలకు వైద్యం అందుబాటులో లేదు. ఇక ప్రసవాల సంగతి చెప్పనక్కరలేదు. ప్రసవం అంటే తల్లో, బిడ్డో చావాల్సిందే. లేదా జోలెకట్టి పట్నం మోసుకెళ్తే వైద్యం.
ఇక దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా, నాలుగులేన్లు, ఆరులేన్ల రహదారులు వచ్చినా, అత్యాధునిక వాహనాలు తిరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు జరిగితే మరణమే. ప్రమాదం నుండి క్షతగాత్రులను తరలించే మార్గమే లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంబులెన్సు సేవలను పారిశ్రామిక వేత్త “సత్యం” రామలింగరాజు 2003లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి గ్రామంలో ఒక అంబులెన్సుతో వైద్యసేవలు ప్రారంభించారు. 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రజలకు మంచి వైద్య సహాయం అందించటానికి ఏమి చేయాలన్న ఆలోచనతో నిపుణుల బృందంతో పలు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్న వైఎస్ఆర్ కు ఉండి గ్రామంలో రాజు నడుపుతున్న ఒక అంబులెన్స్ సర్వీస్ విషయం డాక్టర్ రంగారావు తెలియచేసారు.
ఆ ఆలోచన నచ్చిన వైఎస్ఆర్ ప్రజలకు అత్యవసర సేవలు మరింత మెరుగ్గా అందించే విధంగా తన ఆలోచనను జోడించి ఆ సర్వీసుకి మరికొంత మెరుగులు దిద్ది 2005లో రాష్ట్ర వ్యాప్తంగా 75 అంబులెన్సులతో 108 పథకాన్ని ప్రారంభించి నిర్వహణ బాధ్యత సత్యం గ్రూప్ కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి 108,104 వాహనాల సంఖ్యను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్లారు. దీంతో రాజశేఖర్ రెడ్డి గారి చొరవతో రాష్ట్రమంతటా అందుబాటులో ఉన్న ఈ అంబులెన్సులు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి.
ఈ వాహనాల సేవలకు వైఎస్ఆర్ ఇచ్చిన ప్రాముఖ్యత, నిజంగా ప్రాణాలు కాపాడడంలో అవి అందించిన సేవలు దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని విస్తరించాయి. ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయంటే నాడు వై ఎస్ చూపిన చొరవే ప్రధాన కారణం అని చెప్పాలి. ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించడం, ఆపదలో ఉన్నవారిని, ప్రత్యేకించి ప్రసవవేదనలో ఉన్న మహిళలను, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, ఇంట్లోనే గుండెపోటు వచ్చిన వారిని బ్రతికించిన సంఘటనలు… వాటి కృతజ్ఞత … మొత్తం వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందుతుంది.
ఆ తర్వాత పాలకుల ప్రయారిటీలు మారి, ఈ అంబులెన్సులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు ఒక యేడాది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1088 అంబులెన్సులు ప్రారంభించడం గొప్ప విషయం. ఈ అంబులెన్సులు గ్రామాల్లో తిరుగుతుంటేనే ఒక భరోసా కనిపిస్తుంది.
ఏ ప్రమాదం జరిగినా, ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా 20 నిమిషాల్లో కాకపోతే అరగంటలో అయినా అంబులెన్సు వస్తుంది, ప్రాథమిక చికిత్స జరుగుతుంది, పెద్దాసుపత్రికో లేక ప్రైవేటు ఆసుపత్రికో తీసుకెళ్తుంది అనే భరోసా ప్రజల్లో కలుగుతుంది.
మనిషికి పునర్జన్మ ఇవ్వడంలో ఈ అంబులెన్సులు ప్రయోగం ఒక అద్భుతం. ఆదర్శనీయం. ఈ పథకం ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్ధులు కూడా అభినందించాల్సిందే.