iDreamPost
android-app
ios-app

పేద‌ల ఇళ్ల రికార్డ్ స్థాయి శంకుస్థాపనలు

పేద‌ల ఇళ్ల రికార్డ్ స్థాయి శంకుస్థాపనలు

రాష్ట్ర జ‌నాభాలో ప్ర‌తీ న‌లుగురిలో ఒక్క‌రికి క‌చ్చితంగా ప‌క్కా ఇల్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. క‌రోనా కాలంలో కూడా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ సంచ‌ల‌న‌ సృష్టిస్తున్న ప్ర‌భుత్వం జ‌గ‌నన్న కాల‌నీల పేరుతో ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఇళ్ల నిర్మాణాల‌ను కూడా ప్రారంభించింది.

మొద‌టి ద‌శ‌లో మొత్తం 15,60,227 ఇళ్ల‌ను నిర్మించ‌బోతున్నారు. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ. 28,084 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది. మూడు ద‌శ‌ల్లో ఇళ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది. తొలిద‌శ‌లో ప్ర‌భుత్వం 8,905 లేఅవుట్ల‌లో 11.26 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తోంది. మ‌రో 4.33 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణానికి ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హాయం అందిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం ఎటువంటి అడ్డంకులూ లేకుండా నిరంత‌ర కొన‌సాగేలా ప్ర‌త్యేక జీవోను జారీ చేసింది. ప్ర‌తీ జిల్లాలోనూ ప్ర‌త్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసిన సర్కార్.. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది.

జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, విలేజ్ వార్డు సెక్రటేరీయేట్ శాఖలు ఉండనున్నాయి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో జేసీ-హౌసింగ్ పోస్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక ఇళ్ల నిర్మాణం కోసం మొదటి, రెండో విడతల్లో మొత్తంగా రూ. 50,944 కోట్ల మేర ఖర్చు చేయనుంది జగన్ సర్కార్.

మొదటి విడతలో రూ. 22,084 కోట్లతో జూన్ 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జ‌గ‌న్ రెండో దశలో 22,860 కోట్లతో జూన్ 2023 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాల పూర్తి చేయాలని ఆదేశించింది.

కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఇల్లులేని పేద‌ల‌కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో సుమారు 15 ల‌క్ష‌ల‌కు పైగా గృహాల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. ఈ ప‌థకం ద్వారా 31 ల‌క్ష‌ల కుటుంబాల‌కు స్థిరాస్తుల‌ను క‌ల్పిస్తున్నాం… ఈ కార్య‌క్ర‌మం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇస్తోంద‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

యుద్ధ ప్రాతిప‌దిక‌న గృహ‌నిర్మాణ ప‌నుల‌ను పూర్తిచేస్తామ‌ని, రాష్ట్ర‌జ‌నాభాలో ప్ర‌తి నలుగురిలో ఒక‌రికి ప‌క్కా ఇంటిని ఇస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. రూ.32,900 కోట్ల‌కు పైచిలుకు నిధుల‌తో జ‌గ‌న‌న్న కాల‌నీలను నిర్మిస్తున్న‌ట్టు జ‌గ‌న్ పేర్కొన్నారు. ఒక్కొక్క‌రికి రూ.5 ల‌క్ష‌ల‌ నుంచి రూ.15 ల‌క్ష‌ల విలువ‌చేసే ఆస్తిని ఇస్తున్నామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇంటిని క‌ట్టుకోలేని పేద‌వారికి ప్ర‌భుత్వ‌మే నేరుగా నిర్మించి ఇస్తుంద‌ని అన్నారు. ల‌బ్దిదారుల జాబితాలో పేర్లులేని వారు గ్రామ స‌చివాల‌యాల్లో ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.