iDreamPost
android-app
ios-app

ప్ర‌జ‌ల మ‌నిషి వైఎస్సార్‌

ప్ర‌జ‌ల మ‌నిషి వైఎస్సార్‌

సెప్టెంబ‌ర్ 2, వైఎస్ వ‌ర్ధంతి. ఆ రోజు అనుకున్న‌ది వేరు, జ‌రిగింది వేరు. సాక్షి రాయ‌ల‌సీమ ఇన్‌చార్జ్‌గా ఉన్న నేను, బ్యూరో న‌గేష్‌తో క‌లిసి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం క‌వ‌రేజీకి భారీ ప్లాన్ చేశాం. చిత్తూరులో హెలీప్యాడ్ ద‌గ్గ‌రి నుంచి వ‌రుస‌గా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు రిపోర్ట‌ర్ల‌ని, ఫొటోగ్రాఫ‌ర్స్‌ని స‌మాయ‌త్తం చేశాం. జిల్లా నాయ‌కులు , మంత్రులు వైఎస్‌కి స్వాగ‌తం చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జ‌రిగింది వేరు.

మ‌రుస‌టి రోజు ర‌చ్చ‌బండ ఫొటోల‌తో రావాల్సిన పేప‌ర్ విషాదాన్ని మోసుకొచ్చింది. జ‌ర్న‌లిస్టుల‌కి శాపం ఏమంటే బాధ క‌లిగినా, ప‌ని చేయాల్సిందే. 1990లో నేను ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప ఇన్‌చార్జ్‌గా చేసిన‌ప్ప‌టి నుంచి వైఎస్ ఎన్నో ఫొటోలు చూశాను. ఆయ‌న హాయిగా న‌వ్వుతాడు. సీరియ‌స్‌గా , కోపంగా ఉన్న సంద‌ర్భాలు త‌క్కువ‌. కొన్ని వేల ఫొటోలు పేజీలో పెట్టిన నేను సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో ఆయ‌న కోసం దుక్కించే వాళ్ల ఫొటోలు పెట్టాల్సి వ‌చ్చింది. ఇదో విషాదం.

Also Read:వైఎస్‌కు ముందు… వైఎస్‌కు తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతం

90 నుంచి 95 వ‌ర‌కూ క‌డ‌ప ఇన్‌చార్జ్‌గా చేశాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా వైఎస్‌ని ఇబ్బంది పెడుతున్న రోజులు. అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో వైఎస్ యుద్ధం చేస్తున్న కాలం. ఆయ‌న క‌డ‌ప‌లో వుంటే చాలు, ఒక‌టే జ‌నం. కొన్ని వేల మంది వ‌చ్చేవాళ్లు. అంద‌ర్నీ ప‌ల‌క‌రించి సిఫార్సు ఉత్త‌రాలు ఇచ్చేవారు. తానే స్వ‌యంగా ఫోన్ చేసి సంబంధిత అధికారుల‌కు చెప్పేవారు.క‌డ‌ప క్యాంప్‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా మా రిపోర్ట‌ర్లు ఒక కొత్త విష‌యం చెప్పేవాళ్లు. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో వైఎస్ త‌ర‌చుగా వుండేవారు.

ఒక‌సారి ఆయ‌న వ‌చ్చిన‌పుడు అక్క‌డ ప‌ని చేసే అటెండ‌ర్ గురించి ఫిర్యాదు చేశారు. రూమ్‌లో దిగిన వ్య‌క్తి వాచీని అత‌ను దొంగ‌లించాడు. అటెండర్‌ని పిల‌వ‌మ‌న్నాడు వైఎస్‌. అటెండ‌ర్ వ‌ణుకుతూ వ‌చ్చాడు. వైఎస్ తిడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. వైఎస్ ఏమ‌డిగాడో తెలుసా?

నీ జీత‌మెంత‌, పిల్ల‌లెంద‌రు?
500, ముగ్గురు పిల్ల‌లు.

మేనేజ‌ర్‌ని పిలిచి సీరియ‌స్‌గా “ఈ నెల నుంచి వీడి జీతం పెంచు. 500తో ముగ్గురు పిల్ల‌ల్ని ఎట్లా సాకుతాడు? దొంగ‌త‌నం చేయ‌క ఏం చేస్తాడు?” –వైఎస్ అంటే అది.

క‌డ‌ప‌లో డ‌బ్బుండే కాల‌నీలో ఇస్త్రీ చేసుకుని బ‌తికే పెద్దాయ‌న‌కి సెంటు స్థ‌లం వుండేది. ఒక గుడిసెలో వుండేవాడు. ఆ స్థ‌లంపై పెద్ద‌ల క‌న్ను ప‌డింది. అమ్మాల‌ని ఒత్తిడి. ఆయ‌న వెళ్లి వైఎస్‌కి చెప్పుకున్నాడు. గ‌ద్ద‌ల్ని పిలిచి అంద‌రి ఎదురుగా పిచ్చి తిట్లు తిట్టారు. పెద్దాయ‌న‌కి గుడిసెకి బ‌దులుగా పెంకుటిల్లు త‌న డ‌బ్బుల‌తో క‌ట్టించాడు. పెద్ద భ‌వ‌నాల మ‌ధ్య చిన్న పెంకుటిల్లు ఎందుకుందో కొత్త‌వాళ్ల‌కి అర్థ‌మ‌య్యేది కాదు. అది ఇల్లు కాదు. వైఎస్ అభ‌య‌హ‌స్తం.

ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

Also Read:వైఎస్సార్ – ఒక జర్నలిస్ట్ జ్ఞాపకం

మంగంపేట గ‌నుల్లో ప‌నిచేసే ఒక వ్య‌క్తికి వైఎస్‌తో పాత ప‌రిచ‌యం. కాల క్ర‌మంలో ఆయ‌న వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకుని అప్పుల‌పాల‌య్యాడు. భూమి, ఇల్లు వేలం వేస్తామ‌ని నోటీసులొచ్చాయి. ఏం చేయాలో తెలియ‌లేదు. వైఎస్ ముఖ్య‌మంత్రి, గుర్తు ప‌డ‌తాడో లేదో తెలియ‌దు. వైఎస్ ఎవ‌ర్నీ మ‌రిచిపోడు, గుర్తు ప‌ట్టాడు. వేలం వేయ‌కుండా ఆరు నెల‌ల టైం ఇస్తే అప్పు క‌ట్టుకుంటాన‌ని బ్యాంకు వాళ్ల‌కి చెప్పి ఆ సాయం చేయ‌మ‌ని అడిగాడు. వైఎస్ స‌రేన‌న్నాడు.

మూడు రోజుల త‌ర్వాత బ్యాంకు అధికారులు అత‌ని ఇంటికి వ‌చ్చారు. త‌న‌ఖా పెట్టిన డాక్యుమెంట్లు చేతిలో పెట్టి ” మా స‌ర్వీస్‌లో ఇలాంటి కేసు చూడ‌లేదు. సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రే నీ అప్పు క‌ట్టేశాడు” అన్నారు. ఇవేవీ క‌ల్ప‌న‌లు కావు. ఎంతో చేస్తేనే ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకుంటారు. అందుకే వైఎస్ గొప్ప నాయ‌కుడు.

అన్ని గ్రామాల్లో వైఎస్ విగ్ర‌హాలుంటాయి. మా ఊరు చీమ‌ల‌వాగుప‌ల్లె (అనంత‌పురం జిల్లా)లో కూడా వైఎస్ నిలువెత్తు విగ్ర‌హం వుంది. దాని కింద వైఎస్ అని కాకుండా మా ఊరి అల్లుడు అని వుంటుంది. విజ‌య‌మ్మ అక్క‌డే పుట్టి పెరిగారు.