Idream media
Idream media
నా మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంలో పరిచయమైన రాజకీయ ప్రముఖుల్లో మరచిపోలేని అనడం కన్నా మరచిపోకూడని విలక్షణ వ్యక్తి వై ఎస్ రాజశేఖరరెడ్డి. జర్నలిజంలో చేరిన కొత్తల్లో సీనియర్ జర్నలిస్టులు దుర్గా ప్రసాద్, శ్రీనాధ్ రెడ్డి (ప్రస్తుత ఎపి ప్రెస్ అకాడెమీ ఛైర్మన్) ల ద్వారా రాయలసీమ ఉద్యమ నేతగా వై ఎస్ రాజశేఖరరెడ్డితో 80వ దశకం మధ్యకాలంలో ముఖ పరిచయం ఏర్పడింది. తిరుపతికి చెందిన మిత్రుడు భూమన కరుణాకరరెడ్డి (ప్రస్తుత ఎంఎల్ఏ) ద్వారా దక్కిన వ్యక్తిగత పరిచయంతో డాక్టర్ గారూ అని పిలిస్తే, వాట్ స్వామీ అని చనువుగా పలుకరించే సాన్నిహిత్యం ఏర్పడింది.
1993-1996 మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి కడప జిల్లా విలేకరిగా పనిచేసినప్పుడు వైఎస్సార్ కు ఇతర నాయకులెవరికీ లేనంత జనాకర్షణ ఎందుకు ఉందో అర్ధమైంది. అప్పుడు కడప ఎంపిగా ఉండే వైఎస్ రాజశేఖరరెడ్డి స్వస్థలం పులివెందుల కన్నా కడపలోనే ఎక్కువ కాలం గడిపేవారు. కడపకు ఫలానా రోజు వస్తున్నారనే వార్త ఇమ్మని కోరుతూ కడపలోని ఆయన కార్యాలయ ఇన్‌ఛార్జి సత్యం ముందురోజు అన్ని జిల్లా పత్రికా కార్యాలయాలకు తెలియచేసేవారు.
కడపకు వెళ్లిన కొత్తల్లో ఏ మంత్రులో, ముఖ్యమంత్రో పర్యటనకు వచ్చినప్పుడు తెలియచేసినట్టు ఒక ఎంపి రావడం గురించి వార్త ఇవ్వడమేమిటని నేను అనుకునేవాడిని. కానీ ఆయన కడపకు వచ్చిన రోజు కడప జడ్ పి కాంపౌండ్ ఏరియాలోని వైఎస్సార్ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లినప్పుడు అర్ధమయింది. ఆయన వచ్చే ముందునుంచే వందలాది మంది ప్రజలు బయట వేచివుండేవారు.ఆయన కూడా రాగానే అందర్నీ పలుకరించే డ్యూటీలో దిగిపోయేవారు.
Also Read : వైఎస్‌కు ముందు… వైఎస్‌కు తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతం
ఒక క్షణం వృధా చేయకుండా ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలుకరిస్తూ వారి సమస్యలను వినేవారు.వారి సమస్యలను బట్టి వారి ఎదురుగానే జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్,ఎసిపిల నుంచి మునిసిపల్ కమిషనర్, ఆర్ డి ఓ స్థాయి అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించేవారు. కొన్ని సమస్యల విషయాల్లో లెటర్ కావాలని అడిగేవారి కోసం ఆఫీస్ ఇన్‌ఛార్జి సత్యంను పిలిచి లెటర్ హెడ్ టైప్ చేయమని ఆదేశించేవారు. ఆ లెటర్ సిద్ధం కాగా ఒకసారి చూసి స్వయంగా సంతకం చేసి తానే స్వయంగా లెటర్ ఇచ్చి పంపేవారు. కొన్ని సార్లు వచ్చినవారి పరిస్థితిని బట్టి నాడి పరీక్షించి మందులు కూడా రాసి ఇచ్చేవారు. ఒకరోజు వైఎస్సార్ కడపలో ఉంటే రెండు మూడు లెటర్ హెడ్ పుస్తకాలు అవసరమవుతుందని సత్యం ద్వారా తెలిసింది. అప్పుడు కానీ అర్ధంకాలేదు నాకు వైఎస్సార్ కడపకు వచ్చే విషయాన్ని ముందుగా ప్రజలకు తెలియచేయడం ఎంత అవసరమో.
ఇక 1995 జులై 8వ తేదిన తన పుట్టినరోజున వైఎస్ రాజశేఖరరెడ్డి కడప గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా వేలాదిగా తరలివచ్చిన జనసందోహంతో తిరణాలను తలపించింది. పెద్ద క్యూలైన్లతో ఆ రోడ్డంతా జనం బారులు తీరారు. వైఎస్సార్ దాదాపు రోజంతా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే ప్రముఖులతో మాట్లాడుతూనే సామాన్య ప్రజలను చిరునవ్వుతో పలుకరిస్తూ, కరచాలనం చేస్తూ, వారిచ్చే ఆపిల్, నారింజ పండ్లను తీసుకుంటూ కనిపించారు. ఒకటి రెండు గంటలు కాదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దు పోయేదాకా గడిపారు. అన్నిటినిమించి వైఎస్సార్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినవారిని ఫోటోలు తీసిన కడపకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ రాయల్ రషీద్ సాయంత్రం వరకు దాదాపు నలభైకి పైగా రీళ్లను వినియోగించడాన్ని బట్టి ఎంతమంది వచ్చారో అర్ధమవుతుంది. మరో విశేషమేమిటంటే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినవారిచ్చిన పండ్లను బుట్టల్లో నింపి కడప ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పంచడానికి రోడ్డు చివర రెండు జీపులను సిద్ధంగా ఉంచడం.
ఇలా కడప జిల్లాలో పనిచేసిన మూడు, నాలుగేళ్లలో వైఎస్సార్ ఎక్కడకు వెళ్లినా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కలవడానికి వచ్చినంతగా సామాన్యజనం గుమికూడడాన్ని గమనించాను. కలవడానికి వచ్చేవారిని నవ్వుతూ పలుకరించే తీరు, వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించడానికి పలుకరించే విధానాలే వైఎస్సార్ ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరొందేలా చేసిందని చెప్పకతప్పదు. ఆ లక్షణాలే వైఎస్సార్‌ను నాలుగు దశాబ్దాలకు పైగా ఎంపిగా పోటీ చేసినా, ఎంఎల్‌ఎగా పోటీ చేసినా ఓటమి ఎరుగని నేతగా నిలిపిందనిపిస్తుంది.
నేను చూసినంతవరకు ఒక్క కడప జిల్లాలోనే కాదు అది చిత్తూరు జిల్లా అయినా, నెల్లూరు జిల్లా అయినా, ప్రకాశం జిల్లా అయినా వైఎస్సార్ వచ్చారంటే కేవలం ఆయన్ని చూసేందుకు వచ్చే జనం ఎక్కువగా కనిపించేవారు. గత ఐదారు దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్సార్ విశేష జనాకర్షణ కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు.కానీ బలమైన సినీగ్లామర్ నేపథ్యం ఉన్న ఎన్టీరామారావు కు దీటుగా ఆ స్థాయి నేపథ్యం లేకుండా చిన్న పల్లెలో ఒక రూపాయి డాక్టర్ గా గుర్తింపు పొందిన వైఎస్సార్ మరచిపోలేని మహానేతగా ఎదిగారంటే ఎవరినైనా చిరునవ్వుతో గెలిచే విలక్షణ గుణమే కారణమనిపిస్తుంది.
Written By
Ravi Kumar PV
Senior Journalist,Thirupati