Idream media
Idream media
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.. ఆయనే వైఎస్ ఆర్ గా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్ ఆర్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
మొత్తం ఆరు సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో కూడా అడుగు పెట్టారు. ఓటమి ఎరుగని నాయకుడు. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించారు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. పాదయాత్ర అనే పేరు వింటే గుర్తొచ్చే వ్యక్తిగా నిలిచిపోయారు. 2004లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆయన తన పథకాల ద్వారా ఎనలైని గుర్తింపు పొందారు.
రాజశేఖర్ రెడ్డి పాలనా కాలం రాజన్న రాజ్యంగా గుర్తింపు పొందింది. అంతటి గుర్తింపునకు కారణం.. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే. ముఖ్యమంత్రిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడిగా పేరు పొందారు. అంతటితో ఆయన సంక్షేమ సంతకాలు ఆగలేదు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో అతి ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు చిరస్థాయిలో నిలిచిపోయాయి.
రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య శ్రీ దేశంలోనే అద్భుత పథకంగా గుర్తింపు పొందింది. వేలాది మంది పేదల ప్రాణాలను నిలిపింది. డబ్బున్నవాడికే వైద్యం అన్న పరిస్థితితో పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే బాటలు వేశారు వైఎస్ఆర్.
ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, వైద్యులుగా నేడు లక్షలు సంపాదిస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి చలవే. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఖరీదైన విద్యను పొందగలిగారు. విద్యతో పాటు వైద్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికారు వైఎస్ ఆర్. 108 కు ఫోన్ చేస్తే చాలు.. కుయ్.. కుయ్.. అంటూ నేడు ఆపదలో ఉన్న వారి చెంతకు వస్తున్న అంబులెన్స్ సృష్టికర్త ఆయనే. సెప్టెంబర్ 2, 2009న ఆయన మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయంటే.. ప్రజల హృదయాల్లో ఎంతలా గూడుకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్ కూడా సంక్షేమ సారథిగా ముద్ర వేసుకున్నారు. వారసత్వంతో రాజకీయాలు అబ్బడం సాధారణమే కానీ, సంక్షేమ ఫలాలు అందించడంలో తండ్రికి మించిన తనయుడిగా జగన్ గుర్తింపు పొందారనడం అతిశయోక్తి కాదు. ఏ పథకాలైతే వైఎస్ ఆర్ కు గుర్తింపు తెచ్చాయో, వాటిని మరింత ఎక్కువగా ప్రజలకు చేరువ చేశారు. ఆరోగ్య శ్రీకి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా రూపకల్పన చేసి అదనంగా 2000 వైద్య చికిత్సలను చేర్చారు. అంతేకాదు.. వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే చాలు.. ఆరోగ్య శ్రీ వర్తించేలా చేశారు. అలాగే, గత ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ.35వేలు మాత్రమే ఇచ్చేది. మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు అందిస్తున్నారు.
108 వాహనాల పేరు వినగానే వైఎస్ ప్రభుత్వం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆ సేవలను మరింత విస్తృతం చేశారు జగన్. ఒకేసారి అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన 1088 అంబులెన్సుల్ని అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించారు. 2 వందల కోట్ల రూపాయలతో 108, 104 వాహనాలను రాష్ట్రంలోని 676 మండలాల్లో అందుబాటులో ఉంచారు. రైతు కష్టాలే తన కష్టాలుగా భావించారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అందుకే ధైర్యంగా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రకటించారు. దానికి తగ్గట్టే రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు అందించేందుకు జలయజ్ఞం, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రైతు పక్షపాతి అయిన వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇలా అన్నింటి తండ్రిని జ్ఞప్తికి తెస్తూ, సంక్షేమ సారథిగా జగన్ కూడా గుర్తింపు పొందారు.
– నేడు వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా..