iDreamPost
android-app
ios-app

ఏపీ వైపు… అదానీ, అంబానీల చూపు , సీఎం జగన్‌

  • Published Aug 16, 2022 | 7:26 PM Updated Updated Aug 16, 2022 | 7:26 PM
ఏపీ వైపు… అదానీ, అంబానీల చూపు , సీఎం జగన్‌

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని ప్ర‌క‌టించారు ఏపీ సిం జ‌గ‌న్. ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న సీఎం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంద‌ని తెలిపారు.

ఈ మూడేళ్లలో పారిశ్రామికాభివృద్ధి ప‌రుగులుపెడుతోంద‌న్న సీఎం, ఏపీకి 17 భారీ పరిశ్రమలతో 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమల మొత్తం పెట్టుబ‌డి రూ.8,285 కోట్లని చెప్పారు. మూతపడ్డ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నామ‌ని, రూ.1,463 కోట్లతో ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. మంగళవారం ఉదయం అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు.

“మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే, మరోవైపు సెకెండ్‌ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెపుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే, మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. ఆప్రాంతంలో మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే, పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం.”

గత ప్ర‌భుత్వ హ‌యంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు అవుతోంది. అందులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశామ‌ని జగన్ చెప్పారు. రాష్ట్రంలో9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయి. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అని అందుకే ప‌రిశ్ర‌మ‌ల వెల్లువ మొద‌లైంద‌ని అన్నారు.