iDreamPost
android-app
ios-app

ఢిల్లీ రాజకీయాల్లో పెరుగుతున్న జగన్ బలం 

  • Published Apr 07, 2022 | 4:55 PM Updated Updated Apr 07, 2022 | 6:14 PM
ఢిల్లీ రాజకీయాల్లో పెరుగుతున్న జగన్ బలం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలం ఢిల్లీ రాజకీయాల్లో పెరుగుతోంది. ఆయన ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో ఆయన తలదూర్చే పరిస్థితి లేకున్నా జాతీయ రాజకీయ పరిణామాల్లో ఆయన ప్రమేయం విస్మరించలేని స్థాయికి ఎదిగారు. ఆయన రాజకీయాలు పూర్తిగా రాష్ట్రానికే పరిమితం అయినప్పటికీ,దేశ రాజకీయాల్లో ఆయన నిర్ణయం కీలకం కానుంది. 

పార్లమెంటు ఉభయసభల్లో ఆయన పార్టీ బలం రీత్యా జాతీయ రాజకీయాల్లో ఆయనను విస్మరించడం సాధ్యం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకు లభించిన ఆదరణ చూస్తే రానున్న రోజుల్లో ఆయన ఎంత కీలకం కానున్నారో తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందుగానే అపాయింట్మెంట్ ఇవ్వడం, అపాయింట్మెంటు ఖరారు అయిన తర్వాతే ఆయన తాడేపల్లినుండి బయలుదేరి ఢిల్లీ వెళ్ళడం మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.అలాగే ఆయన అడిగిందే తడవుగా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యంగా హోమ్ మంత్రి అమిత్ షా, వెంటవెంటనే జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవడం చూస్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఎంత కీలకం అవుతున్నారో తెలుస్తోంది. 

రాజకీయాలు కేవలం గెలుపు ఓటములే కాదు. అదొక సంఖ్యాశాస్త్రం కూడా. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు, కేంద్రంలో ప్రత్యేకించి పార్లమెంటు ఉభయసభల్లో ఒక పార్టీ బలం కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు లోక్ సభ లో జగన్మోహన్ రెడ్డి బలం 22 స్థానాలు ఉంది. ఈ సంఖ్య కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉనికికి ప్రమాదకరం కాకపోవచ్చు. అలాగే మొత్తం లోక్ సభ సభ్యుల్లో కూడా ఎక్కువ కాకపోవచ్చు. కానీ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తర్వాత నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. దక్షిణాదిన తమిళనాడు నుండి డీఎంకే 24 మంది సభ్యులతో లోక్ సభలో అతిపెద్ద మూడవ పార్టీగా నిలవగా, వైఎస్సార్
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ 22 మంది సభ్యులతో  నాలుగవ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. 

ఇక రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ జూన్ నాటికి ఆ పార్టీ బలం 9కి పెరుగుతుంది. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభలో 6వ అతిపెద్ద పార్టీగా నిలుస్తుంది. పైగా అరకొర సంఖ్యాబలంతో ఉన్న అధికార బీజేపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అంశాలవారీగా అధికార పార్టీకి మద్దతు ఇస్తోంది. ఇలాంటి మద్దతు కూడా రాజ్యసభలో బీజేపీకి అవసరం. పైగా ప్రస్తుతం 101 స్థానాలు ఉన్న బీజేపీ ఈ యేడాది జూన్ నాటికి మరో మూడు స్థానాలు కోల్పోతుంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకుని తన బలాన్ని పెంచుకుంటుంది. ఇలాంటి కీలక పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతో కీలకం. 

రాజకీయాలు నెంబర్ గేమ్ కాబట్టి ఆ సంఖ్యాబలం జగన్ వద్ద ఉంది కాబట్టి ఇకపై జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుతున్నారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కీలకం కానుంది. అందుకే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలికింది. అయితే ఇప్పుడు పెరుగుతున్న బలాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించుకుంటారో చూడాల్సిందే.