iDreamPost
android-app
ios-app

ఆ బాధలు విన్నా.. అందుకే ఇలా చేస్తున్నా – వైఎస్‌ జగన్‌

ఆ బాధలు విన్నా.. అందుకే ఇలా చేస్తున్నా – వైఎస్‌ జగన్‌

తన ప్రజాసంకల్ప పాదయాత్రలో భూముల వివాదాలకు సంబంధించిన సమస్యలు ప్రతి జిల్లాలోనూ విన్నానని, అందుకే ఆ సమస్యలను తీర్చేందుకు వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం తీసుకొచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ పథకంలో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో చేసిన భూముల రీ సర్వే పూర్తయింది. ఆయా గ్రామాల్లోని భూ యజమానులకు హక్కు పత్రాలు అందించడం, ఆయా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించే కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న ఇళ్లు, ఇళ్ల స్థలం వివాదాల్లో చిక్కుకుంటే ఆ బాధ మాటల్లో చెప్పలేం. అలాంటి బాధ రాష్ట్రంలో ఎవరూ పడకూడదని, భూ సమస్యలు పరిష్కరించి, ఎలాంటి వివాదాలు లేకుండా, గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. ఇది పెద్ద సంస్కరణ. భూముల హక్కులు, హద్దులకు సంబంధించి.. భారతదేశంలో వంద సంవత్సరాల క్రితం భూముల సమగ్ర సర్వే చేశారు. ఆ తర్వాత జమాబందీ విధానంలో 1983 వరకు భూముల సమస్యలు పరిష్కారం చేసేవారు. కరణాల వ్యవస్థ రద్దు కావడం, దాని స్థానంలో సరైన వ్యవస్థ లేకపోవడంతో అంతవరకు జరిగిన జమా బందీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.

భూముల సర్వే జరగకపోవడం, సరైన వ్యవస్థ లేకపోవడంతో భూముల ట్యాంపరింగ్‌ జరుగుతోందని నా పాదయాత్రలో ప్రజలు చెప్పారు. భూమి విలువ, విస్తీర్ణం, కొలతలు భిన్నంగా ఉన్నాయి. సర్వే నంబర్‌లో కొంత భూమి విక్రయం జరిగి ఉంటుంది. కానీ సర్వే నంబర్‌ సబ్‌ డివిజన్‌ జరగలేదు. పట్టాదారు పాస్‌ బుక్కులు ఉన్నా.. ఫలితం లేకుండా పోతోంది. భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడంతో.. తమ భూముల రికార్డులు తారుమారు అయ్యాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సివిల్‌ కేసుల్లో దాదాపు 90 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించి ఉన్నాయంటే.. ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : దళితుల ఉపాధికి జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, వారసత్వంగా వచ్చిన భూమి చేజారిపోతుంటే, వివాదాల్లో చిక్కుకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే చేసి.. ప్రతి భూమికి ప్రత్యేకమైన నంబర్‌ కేటాయిస్తున్నాం. డిజిటల్‌ విధానంలో క్యూఆర్‌ కోడ్‌తోపాటు సరిహద్దు రాళ్లుపాతి ఇస్తున్నాం. డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు, లంచాలకు అవకాశం లేకుండా పోతుంది. ప్రజలు ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమాన్ని తెచ్చింది.

ఈ కార్యక్రమాన్ని 13 నెలల కిందట ప్రారంభించాం. ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరి భూమిని సమగ్ర ఆధునిక పద్దతుల్లో 2023 డిసెంబర్‌ నాటికి రీ సర్వే చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఎవరూ చేయలేదు. 2021 డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమం ప్రారంభించాం. కోర్స్, డ్రోన్స్‌ టెక్నాలజీ వాడుతున్నాం. 10,151 మంది శిక్షణ ఇచ్చాం. 4500 సర్వే బృందాలు పని చేస్తున్నాయి. దాదాపు వేయి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్నాం. ఇందులో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో 29 వేల ఎకరాలు సర్వే పూర్తి చేశాం. 3,304 అభ్యంతరాలు పరిష్కారం. సమస్యలు పరిష్కరించి.. హద్దులు, యూనిక్‌ కోడ్, శాశ్వత హక్కులతో కూడిన పత్రాలు ఆయా భూముల యజమానులకు అందిస్తున్నాం.

రీ సర్వే పూర్తయిన తర్వాత.. నకిలీ పత్రాల సమస్య ఉండదు. భూ యజమానులకు తెలియకుండా పత్రాలు మార్చే పరిస్థితి ఉండదు. భూములు విక్రయించే ముందు సబ్‌ డివిజన్‌ జరుగుతుంది. వేరే వారు ఎవరో భూములు ఆక్రమించే అవకాశం ఉండదు. సర్వే చేసే సమయంలోనే ప్రతి అడుగులోనూ భూ యజమానులను భాగస్వాములను చేస్తున్నాం. వారి సమక్షంలో, వారి సహకారం, సమ్మతితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. మండల స్థాయిలో మొబైల్‌ మేజిస్ట్రేట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తాం.

తొలిసారి గ్రామ కంఠాల్లోని ఇళ్లు, స్థిరాస్తులు కూడా సర్వే చేయించడంతోపాటు యాజమాన్య ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తాం. ఆ తర్వాత వారు ఆ ఆస్థిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్థి రిజిస్ట్రేషన్‌ చేసే పరిస్థితిని దశల వారీగా అమలు చేస్తాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సింగిల్‌ విండో విధానంలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ పత్రం, భూ సమాచారం ఎక్కడ నుంచైనా తెలుసుకునే అవకాశం లభిస్తుంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివరించారు.

Also Read : శాశ్వత భూ రక్ష పథకం.. చరిత్ర సృష్టించిన జగన్