Idream media
Idream media
పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా చదివించాలని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం శుక్రవారం నంద్యాలలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యా వ్యవస్థలో అమలుచేస్తున్న సంస్కరణలు, వాటి వల్ల కలిగే ఫలితాలను ఆయన వివరించారు.
‘‘ ఇక్కడే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ మాటను నిలబెట్టుకున్నాం. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. పిల్లల చదువుల కోసం విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నాం. పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప, బాబు ప్రాథమిక, ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. ఉన్నత చదువుల వల్ల ఏ ఒక్క తల్లి,తండ్రి అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశాను. చదువును ఆస్తిగా ఇవ్వాలని అనుకున్నారు.పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చి ఆ పిల్లలను, తల్లిదండ్రులను ఆదుకున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే వసతి దీవెన పథకం అమలు చేస్తున్నాం.
వైఎస్సార్ హయాంలో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ అమలు చూశాం. ఆ తర్వాత పాలకులు నీరుగార్చే ప్రయత్నాలు చూశాం. వైఎస్సార్ తనయుడిగా ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి పూర్వవైభవం తీసుకువచ్చాం. దాంతోపాటు జగనన్న వసతి దీవెన పథకాన్ని తెచ్చాం. ఇక్కడ నుంచి 10.60 లక్షల పిల్లలకు మేలు జరిగేలా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత కింద 1024 కోట్ల రూపాయలు పంపిస్తాం. జగనన్న వసతి దీవెన కింద కాలేజీలకు వెళ్లి ఐటీఐ విద్యార్థులకు పది వేల రూపాయలు, పాలిటెక్నిక్ వారికి 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివేవారికి 20 వేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఏడాదికి రెండు దఫాలుగా ఇస్తామని చెప్పాం. ఈ రోజు రెండో విడత నగదు ఇస్తున్నాం. ఒక కుటుంబంలో ఒకరికే ఇచ్చే పరిస్థితులు పోయాయి. అందరికీ పథకం అమలు చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించండి. నేను అండగా ఉంటాను. చదువే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి.
జగన్న విద్యా దీవెన కింద నగదు తల్లుల ఖాతాల్లో వేయడం వల్ల కాలేజీలకు జవాబుదారీతనం వస్తుంది. వసతులు లేకపోతే తల్లులు ప్రశ్నించవచ్చు. వసతులు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటాం. జవాబుదారీతనం ఉంటే కాలేజీల్లో మంచి వసతులు వస్తాయి.
విద్యా వ్యవస్థలో గడిచిన మూడేళ్లలో సమూల మార్పులు తెచ్చాం. నాడు–నేడు పేరుతో చిన్నపిల్లలు చదివే స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. గతంలో బోర్డులు, మూత్రశాలలు, పెయింటింగ్, భవనాలు శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. అవన్నీ మార్చివేశాం. చదువే కాదు.. మంచి ఆహారం ఇవ్వాలని సంకల్పించాం. గోరుముద్ద పేరుతో రోజుకు ఒక మెను తో భోజనం పెడుతున్నాం. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం. టీచర్లు, పిల్లలకు ప్రారంభంలో అర్థమయ్యేలా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించాం. ఈ రోజు నుంచి 15, 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రపంచంలో మన పిల్లలు పోటీపడేలా, నెగ్గేలా విద్యారంగాన్ని మార్చుతున్నాం. స్కూళ్ల నుంచి మొదలైన ఈ మార్పు కాలేజీల వైపు కూడా నడుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. స్కిల్ డెవెలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. యూనివర్సిటీలు వస్తున్నాయి. చదువులు అన్నీ జాబ్ ఓరియంటెడ్ గా మార్చాం. ఇంటర్నెషిప్ తప్పనిసరి చేశాం. దాదాపు 67 ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టాం. డిగ్రీలో ఆనర్స్ నాలుగు సంవత్సరాల కోర్సును ప్రవేశపెట్టాం.
ఏ తల్లి అయినా కూడా తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని ఆరాటపడుతుంది. ఆ తల్లి ఆశలను తీర్చేందుకు మనం పని చేస్తున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏడాది 15 వేల రూపాయలు అమ్మ ఒడి పేరుతో అందిస్తున్నాం. 84 లక్షల మంది పిల్లలు, 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా మేలు జరుగుతోంది.
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, సున్నా వడ్డీ రుణాలు, కార్పొరేట్ సంస్థలతో టైఅప్ చేసి వ్యాపారాలు పెట్టించాం. తల్లులు బాగుంటే పిల్లలు బాగుంటారు. మూడేళ్లలో అక్కచెల్లెమ్మల పక్షపాతంగా పని చేశాం. పిల్లల చదువులే కాకుండా వారి శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భవతులకు, ఆరునెలల నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల వరకు పోషకాహారం అందిస్తున్నాం. ఈ పథకానికి ఏడాదికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. గోరుముద్ద పథకానికి 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
పిల్లలకు ఇచ్చే చిక్కీకి కవర్ పెట్టి పరిశుభ్రతగా అందిస్తుంటే.. చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం చిక్కీ కవర్ మీద జగన్ ఫోటో ఉందని అసూయ పడుతున్నారు. వీరి అసూయకు అంతులేదు. ఇలాగే ఉంటే వారికి బీపీ వస్తుంది. టిక్కెట్ త్వరగా తీసుకుంటారు.
చంద్రబాబు ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పోతే.. పిల్లలు ఇబ్బంది పడకూడదని అవన్నీ మన ప్రభుత్వం చెల్లించింది. 6.900 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెన కింద ఇచ్చాం. 3,329 కోట్ల రూపాయల వసతి దీవెన కింద ఇచ్చాం. కేవలం ఈ రెండు పథకాలకు 34 నెలల కాలంలో 10,298 కోట్ల రూపాయలు మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది.
విద్యా సంస్కరణలు అమలు చేయడం వల్ల డ్రాప్ అవుట్స్ బాగా తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మన ప్రభుత్వం రాక ముందు 37 లక్షల మంది అయితే.. మన ప్రభుత్వం వచ్చాక 44 లక్షల మంది చదువుతున్నారు. ఏడు లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు కావాలంటే ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చే పరిస్థితి వచ్చింది.
ఇవన్నీ మనం వచ్చాక వచ్చిన మార్పులు. కానీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి, ఎల్లోమీడియాకు కనిపించడం లేదు. రోజుకు ఒక కట్టుకథ అల్లి, బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో చేసే గోల సరిపోదని, పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాష్ట్ర పరువును తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఉంటాయి. రాష్ట్ర ప్రతిష్టను అంతా కలిసి పెంచుతాయి. కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా ఇక్కడ ఉండడం మన కర్మ. వీరందరూ మన రాష్ట్ర పరువును దిగజార్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇవేమీ నన్ను కదిలించలేవు. మార్చలేవు. మీ అందరి దీవెనలతో నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ దీవెనలు ఉన్నంతకాలం వారు నన్నేమీ చేయలేరు. దేవుడి దయ, మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలని, మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను..’’అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.