iDreamPost
android-app
ios-app

కొత్త ట్రెండ్‌ను సృష్టించిన వైఎస్‌ జగన్‌

కొత్త ట్రెండ్‌ను సృష్టించిన వైఎస్‌ జగన్‌

దాదాపు ఇప్పటి వరకు రాజకీయాల్లో దాదాపు నేతలందరిదీ ఒకే సై్టల్‌. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్ని అమలు చేయడం, మరికొన్నింటిని అటకెక్కించడం ఇటీవల కాలంలో బాగా కనిపిస్తున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర నేతలు అనే తేడా ఏమీ లేదు. ఈ పరిస్థితికి చమరగీతం పాడారు ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. హామీలు ఇవ్వడం అంటే అమలు చేయడం, మేనిఫెస్టోను పవిత్రమైన మత గ్రంథాలతో పోల్చుతూ.. అందులో పొందుపరిచిన ప్రతి హామీని అమలు చేసే లక్ష్యంతో పని చేసిన వైఎస్‌ జగన్‌.. గడిచిన రెండున్నరేళ్లలో 96 శాతం హామీలు అమలు చేసి.. రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఏమిటో చూపించారు.

ఏం చెప్పాను.. ఏం చేశాను..

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం, ప్రజలు లేదా మీడియా గుర్తు చేసినప్పుడు.. నేను ఎప్పుడు చెప్పాను.. అలా చెప్పలేదంటూ దబాయించిన పరిస్థితి మొన్నటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. పథకం అమలు చేసే సమయంలో ఎన్నికల సమయంలో తాను ఏం చెప్పానో నాటి వీడియోలు బహిరంగ సభల్లో ప్రదర్శించి.. మరీ గుర్తుచేస్తున్నారు. తాను ఆ హామీ ఇచ్చానని.. అదే నేడు అమలు చేస్తున్నానంటూ ప్రజలకు వివరిస్తూ.. జగన్‌ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

Also Read : అక్క‌డ కాంగ్రెస్ లో ఆ సోయ క‌నిపించ‌ట్లే..!

ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరి..

వైఎస్‌ జగన్‌ దూకుడుతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డ్వాక్రా రుణాలు 14,202 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. రుణాలు ఎవరూ కట్టొద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అటకెక్కించారు. ఫలితంగా డ్వాక్రా సంఘాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఆయా సంఘాలకు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు.. ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్‌ 11) ఉన్న డ్వాక్రా రుణాలన్నీంటినీ తిరిగి సభ్యులకు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వైస్‌ జగన్‌ హామీని ఇచ్చారు. రుణాలను కట్టడడం ఆపొద్దని.. కట్టిన రుణాలను నాలుగు విడతల్లో మళ్లీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామన్న జగన్‌.. ఆ హామీని అమలు చేస్తున్నారు. గత ఏడాది తొలి విడత, ఈ రోజు రెండో విడత నగదును మహిళల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 25,517 కోట్ల మొత్తంలో రెండు విడతలకు గాను ఇప్పటి వరకు 12,759 కోట్ల రూపాయలు అందించారు.

చంద్రబాబు హామీ ఇచ్చిన సమయంలో డ్వాక్రా రుణాలు 14,204 కోట్ల రూపాయలు కాగా.. అంతకు దాదాపు రెట్టింపు మొత్తాన్ని వైఎస్‌ జగన్‌ డ్వాక్రా సంఘాలకు అందిస్తున్నారు. అనుభవజ్ఞుడును అని చెప్పుకున్న చంద్రబాబు చేయలేనిది వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. ఇద్దరు నేతలు.. ఇచ్చింది ఒకే హామీ.. కానీ అమలులో చిత్తశుద్ధిని చూపించిన వైఎస్‌ జగన్‌.. తన విశ్వసనీయతను మరింత పెంచుకున్నారు. పథకం అమలు సమయంలో.. నాడు చంద్రబాబు ఏం చెప్పారు.. ఏం చేశారు.. వైఎస్‌ జగన్‌ ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు.. అనే వీడియోలను బహిరంగ సభల్లో ప్రదర్శిస్తుండడంతో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల నోళ్ల నుంచి మాట పెగలడం లేదు.

Also Read : మహిళ సాధికారతే ధ్యేయంగా వైఎస్సార్ ఆసరా