iDreamPost
iDreamPost
పల్లెల్లో కాయా కష్టం చేసుకొని బ్రతికేవారికి జబ్బొస్తే వెళ్లడానికి ఆసుపత్రి ఉండదు. ఒకవేళ హాస్పిటల్ ఉన్నా సరైన సమయంలో వైద్య సేవలు అందుతాయన్న భరోసా ఉండదు. వైద్యసేవల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అత్యవసర వైద్యసేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది..
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలంలో 42వేల దాకా జనాభా ఉంది. నల్లమాడతో కలిపి మొత్తం పది గ్రామాలున్నాయి. అయితే పల్లెటూర్లంటే గుర్తొచ్చేది వ్యవసాయం. గ్రామాల్లోని ప్రజలు ఉదయం లేవగానే పొలం పనులకు వెళితేకానీ వారికి పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పొరపాటున అనారోగ్యం బారిన పడితే 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురానికి వెళ్లాల్సిందే.
నల్లమాడ మండలకేంద్రంలో 2003లో 30 పడకల ఆసుపత్రి అని ఒకదానిని పెట్టి వదిలేశారు. పేరుకే పెద్దాసుపత్రిగా పిలుచుకుంటున్నా సరైన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండరు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నల్లమాడ ఆసుపత్రి ఉందిలే అన్న భరోసా లేకుండా పోయింది. కొన్నేళ్ల నుంచి నల్లమాడ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తారని చెబుతున్నా ఇంతవరకు ఆ ప్రక్రియ జరగలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఎమ్మెల్యే పుట్టపర్తి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలిచిన తరువాత ఆయన నియోకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే నల్లమాడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే నల్లమాడ ఆసుపత్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌తో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తెలిసిన వై.ఎస్ జగన్ ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.
మరికొద్ది రోజుల్లోనే నల్లమాడ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది. వంద పడకల ఆసుపత్రి అవ్వగానే 24 గంటలు ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు ఆసుపత్రిలో నియమించబడతారు. ఈ ఆసుపత్రిలో అందుబాటులోలేని ఇతర వ్యాధులకు మాత్రమే అనంతపురం వెళ్లవచ్చు. ఇప్పటికే నల్లమాడను అభివృద్ధి చేస్తున్నారన్న వార్తలతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న రోగమొచ్చినా వెళితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలి.. లేదంటే అనంతపురం, కర్నూలు వెళ్లాల్సి వస్తోందని.. ఇప్పుడు ప్రభుత్వం తమ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే ఈ గ్రామాలకంతా ఇబ్బంది ఉండదని ప్రజలు సంబరపడుతున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పేరుతో పేదవారికి ఇబ్బందులు లేకుండా చేస్తున్న వై.ఎస్‌జగన్ ప్రభుత్వం.. ఈ తరహాలో గ్రామీణ వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పేదవారికి ఇబ్బందులుండవు..