రోడ్డుపై అనుమానాస్పదంగా కనబడిన యువకులను పోలీసులు ప్రశ్నించే క్రమంలో సదరు యువకులు పోలీసులను మాటల్లో పెట్టి వాళ్ళ వాహనంలోనే పరారీ అయ్యే సన్నివేశాలు గతంలో తెలుగు కామెడీ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ అలా పోలీసులకు మస్కా కొట్టి ఏకంగా సీఐ వాహనంలో ఒక యువకుడు పరారైన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడా వద్ద గురువారం అర్థరాత్రి నలుగురు యువకులు రోడ్డు మీద మద్యం తాగడాన్ని పెట్రోలింగ్ లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గమనించి అర్ధరాత్రి సమయంలో అక్కడ ఏం చేస్తున్నారని యువకులను ప్రశ్నించాడు. యువకులను ప్రశ్నింస్తుండగా సీఐ ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఒక యువకుడు పోలీసుల కళ్లుగప్పి పెట్రోలింగ్ వాహనంతో ఉడాయించాడు.
దాంతో ఖంగుతిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు రూరల్ ఎస్ఐ పరమేష్‌కి సమాచారమివ్వడంతో తన బృందంతో యువకుడిని వెంబడించారు. యువకుడు పారిపోయే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో పెట్రోలింగ్ వెహికల్ ముందు భాగం ధ్వంసం అయింది. ఆలగడప టోల్ గేట్ వద్ద యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.