iDreamPost
iDreamPost
ఎట్టకేలకు సోషల్ మీడియాలో తమ మీద వస్తున్న విమర్శలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెనక్కు తగ్గింది. నిన్న అదే పనిగా టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ గురించి నానిని టార్గెట్ చేయడం పట్ల అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం తప్పు బట్టారు. కొద్దిరోజుల క్రితం నాని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ నిర్మాతల శ్రేయస్సు కోసం నిర్ణయం వాళ్ళకే వదిలేశానని చెప్పినా కూడా అంతెత్తున కొందరు ఎగ్జిబిటర్లు ఫైర్ అవ్వడం పట్ల ఇండస్ట్రీలో సైతం కామెంట్స్ వినిపించాయి. ఇలా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఎవరో ఒకరి మీద అబాంఢాలు వేయడం సరికాదని, వాస్తవిక కోణంలో అలోచించి సమస్య గురించి మాట్లాడితే బాగుండేదని వాటిలో అన్నారు.
మొత్తానికి ఒక సెపరేట్ ప్రెస్ నోట్ ని ఇందాకా సంఘం తరఫున సారీ చెబుతూ వెలువడింది. అందులో నాని పేరు లేదు కానీ టక్ జగదీష్ అని ప్రస్తావించారు కాబట్టి అది న్యాచురల్ స్టార్ ని ఉద్దేశించిందేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో నిన్న ఆవేశం ఇవాళ క్షమాపణగా మారిపోయింది. నిజానికి అమెజాన్ ప్రైమ్ ఇప్పటిదాకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఈలోగానే ఇంత రచ్చ జరిగిపోయింది. సాధారణంగా ప్రైమ్ ఏదైనా ఓటిటి ప్రీమియర్ ప్లాన్ చేసుకుంటే నెల ముందు చెప్పదు. కేవలం వారం ముందు ప్రమోషన్లు చేసి హైప్ ని అమాంతం పెంచేస్తుంది. నారప్ప విషయంలో జరిగింది అదే. సైలెంట్ గా డేట్ చెప్పి స్ట్రీమింగ్ చేశారు.
కానీ ఇప్పుడు టక్ జగదీష్ విషయంలోనే వ్యవహారం పీక్స్ కు వెళ్లిపోయింది. నిజానికి నాని ఆ మధ్య తిమ్మరుసు ఫంక్షన్ లో థియేటర్ల గొప్పదనం గురించి చెప్పడం ఇప్పుడీ రచ్చ ఎక్కువ కావడానికి కారణం అయ్యిందని చెప్పాలి. ఎవరికీ పట్టక అందరూ మౌనంగా ఉన్నప్పుడు తను మాత్రం ఏదో ఒక ఇష్యూ మీద నోరైతే విప్పాడు. అది మరచిపోయి నానిని పర్సనల్ గా తీసుకోవడం మాత్రం ఏ మాత్రం సమర్ధింపు కాదు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఓటిటిల విషయంలో కఠిన నిర్ణయాల కోసం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసేలా ఉన్నారు. గతంలోనూ ఇలా అనుకుని మళ్ళీ మొదటికే తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. చెప్పుకోవడానికి బాగుంది కానీ ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేవి కావు
Also Read : చైతు తగ్గాల్సిన అవసరం ఉండదు