చంద్రబాబు మీద లేచినవే అసలైన ధిక్కార స్వరాలు

వైసిపిలో ధిక్కార స్వరాలంటూ కొద్ది రోజులుగా పిచ్చిరాతలు రాస్తున్న ఎల్లోమీడియాకు చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా లేచిన గొంతులను బయటకు వినబడనీయకుండా నానా అవస్తలు పడింది. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత అప్పటి వివాదాస్పద ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కూడా చాలా గట్టిగానే మాట్లాడాడు. కరణం బలరామ్ లాంటి వాళ్ళు చంద్రబాబు మీద ఎంత మాట్లాడినా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కవర్ చేసేందుకు పడిన నానా అవస్తలు అందరికీ గుర్తున్నాయి.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంతో బోండా ఉమా మాట్లాడుతూ ’చంద్రబాబు నమ్మించి కాపుల గొంతు కోశాడు’ అంటూ మండిపడ్డాడు. బోండా చేసిన వ్యాఖ్యలు పార్టీలో అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. తర్వాత బుచ్చయ్య మాట్లాడుతూ పచ్చి అవకాశవాదులకు, డబ్బు సంచులు మోసేవారికే చంద్రబాబు మంత్రిపదవుల్లో చోటు కల్పించినట్లు చేసిన ఆరోపణలు కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఓ వ్యూహం ప్రకారం ఎన్టీయార్ అభిమానులను చంద్రబాబు పార్టీకి దూరంగా నెట్టేస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి.

టిడిపిలో తాను ఉండలేనని ఎన్టీయార్ పేరుతో తొందరలోనే కొత్త పార్టీ పెడతానంటూ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, చేసిన హడావుడితో పార్టీలో అప్పట్లో గందరగోళం రేపింది. వైసిపి తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ను టిడిపిలో చేర్చుకున్నపుడు సీనియర్ నేత కరణం బలరామ్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. రవిలాంటి పోటుగాడు టిడిపిలో లేరా అంటూ చంద్రబాబునే నిలదీశాడు. తమ మనోభావలకు విరుద్ధంగా గొట్టిపాటిని చేర్చుకుంటున్న విషయమై మండిపడిన కరణం సమయం వచ్చినపుడు తానేంటో చూపిస్తానంటూ చంద్రబాబునే హెచ్చరించటం అప్పట్లో జిల్లాలో సంచలనమైంది.

తాను పేరుకు రెవిన్యు మంత్రిని కాని ఒక్క రెవిన్యు ఇన్ స్పెక్టర్ ను కూడా బదిలీ చేసే అధికారం తనకు లేదని మాజీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఎన్నిసార్లు తన అసంతృప్తిని బయటపెట్టాడో లెక్కేలేదు.

ఇక అయ్యన్నపాత్రుడు గురించి చెప్పనే అక్కర్లేదు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో అప్పటి సహచర మంత్రి గంటా శ్రీనివాసే కీలక పాత్రదారంటూ పెద్ద బాంబే పేల్చాడు. అంతేకాకుండా గంటా కబ్జాలపై అయ్యన్న ప్రభుత్వానికి సాక్ష్యాలు కూడా అందించాడు.

వీటిని ధిక్కార స్వరాలంటారన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయింది. అంతేకానీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ధిక్కారస్వారాలు ఎలాగవుతాయంటూ వైసిపి ఎంఎల్ఏలు అడిగిన ప్రశ్నలకు ఎల్లోమీడియా సమాధానం చెప్పగలుగుతుందా ?

Show comments