Idream media
Idream media
అవినీతి, అక్రమాలు, హత్య.. ఇలా ఏ అంశంపైన అయినా టీడీపీ నేతలపై కేసులు నమోదు అయితే.. వాటిని ఎదుర్కొనేందుకు, ప్రజలను ఆ విషయాల నుంచి డైవర్ట్ చేసేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా సహకారంతో ఒకే ఒక్క ఆయుధాన్ని వాడుతోంది. అదే.. కక్ష సాధింపు. టీడీపీ నేతలపై కేసులు నమోదు అయిన ప్రతి సందర్భంలోనూ కక్ష సాధింపుతోనే తమ పార్టీ నేతలు, చంద్రబాబు సన్నిహితులపై కేసులు పెట్టారంటూ టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నాయి.
తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో 241.78 కోట్ల రూపాయల నిధులు షెల్ కంపెనీలకు మళ్లించి కొల్లగొట్టారనే అభియోగాలపై ఏపీ సీఐడీ మాజీ ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుడుగా పని చేసిన లక్ష్మీ నారాయణపై కేసు నమోదు చేసింది. శుక్రవారం ఆయన ఇంట్లో సోదాలు చేసింది. ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు లక్ష్మీ నారాయణ ఓఎస్‌డీగా పని చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీ నారాయణను.. చంద్రబాబు తన సలహాదారుడుగా నియమించుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ ప్రాజెక్టుకు సలహాదారుడుగా వ్యవహరించారు. ఆ సమయంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణ తర్వాత.. నిజా నిజాలు కోర్టు తేలుస్తుంది.
Also Read : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. సీఐడీ నోటీసులు.. ఆస్పత్రిలో చేరిన లక్ష్మీనారాయణ
అయితే కేసు నమోదు అయి, సీఐడీ సోదాలు చేయగానే.. టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా.. కక్ష సాధింపుతోనే లక్ష్మీ నారాయణపై కేసు పెట్టారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. చంద్రబాబు వద్ద లక్ష్మీ నారాయణ పని చేయడంతో ఆయనపై కక్ష పెంచుకుని సీఐడీ ద్వారా జగన్ ప్రభుత్వం కేసులు పెట్టించిందని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది.
లక్ష్మీ నారాయణ విషయంలోనే కాదు.. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫోర్జరీ పత్రాలతో కాలం చెల్లిన లారీలను విక్రయించారనే అభియోగాలపై కేసు నమోదైనప్పుడు, ఈఎస్‌ఐలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే అభియోగాలపై కింజారపు అచ్చెం నాయుడుపై ఏసీబీ కేసు పెట్టి, అరెస్ట్ చేసినప్పుడు, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొన్నారనే అభియోగాలపై అప్పటి ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసులు పెట్టినప్పుడు.. కక్ష సాధింపుతోనే కేసులు పెట్టారని, వీరెవరూ ఏ తప్పు చేయలేదంటూ టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేశాయి.
అవినీతి కేసుల్లోనే కాదు.. హత్య కేసుల్లోనూ ఇదే వైఖరిని అవలంభించాయి. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో పక్కా ఆధారాలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు కూడా కక్ష సాధింపుతోనే చేశారంటూ వాదించి.. ప్రజలను డైవర్ట్ చేసేందుకు యత్నించారు. కానీ పైన పేర్కొన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ కోసం టీడీపీ నేతలు అష్ట కష్టాలు పడ్డారు. పలుమార్లు ప్రయత్నించాక గానీ బెయిల్ రాలేదు. ఇప్పుడు లక్ష్మీ నారాయణ విషయంలోనూ కక్ష సాధింపు అనే వజ్రాయుధాన్ని టీడీపీ నేతలు వాడుతూ.. తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read : సీఐడీ అధికారులు రాధాకృష్ణను బతిమిలాడారంట