iDreamPost
android-app
ios-app

ఆ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయదు! బీజేపీలో యడ్డీ వ్యాఖ్యల కలకలం

  • Published Sep 20, 2021 | 11:07 AM Updated Updated Sep 20, 2021 | 11:07 AM
ఆ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయదు!  బీజేపీలో యడ్డీ వ్యాఖ్యల కలకలం

పదవి నుంచి తప్పుకున్న తర్వాత నెలన్నర రోజులకు పైగా మౌనం వహించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తొలిసారి మౌనం వీడి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు నేరుగా బీజేపీ అధిష్టానాన్ని తాకడం కలకలం రేపుతోంది. ఎన్నికల్లో మోదీ బొమ్మ ఒక్కటే విజయం చేకూర్చదని నేరుగా పార్టీ కార్యవర్గ సమావేశంలోనే వ్యాఖ్యానించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు అవాక్కయ్యారు. పార్టీ అధిష్టానం కూడా యడ్డీ వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవి కోల్పోయిన యడ్యూరప్ప పార్టీకి వ్యతిరేకంగా మెల్లగా గళం విప్పుతున్నారని పలువురు పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

మోదీ చరిష్మాను నమ్ముకోలేం

బెంగళూరులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న యడ్డీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ బొమ్మ పెట్టుకుని గెలిచేస్తామన్న ధీమా పనికి రాదని.. మోదీ మంత్రం ఇక్కడ పనిచేయదని కార్యకర్తలకు, నాయకులకు స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ బొమ్మ ఫలితం చూపిస్తుందేమో గానీ అసెంబ్లీ ఎన్నికల్లో అది పనికిరాదన్నారు. స్థానిక సమస్యలు, స్థానిక నేతలే ఇక్కడ ప్రభావం చూపుతాయని.. అందువల్ల ఇప్పటినుంచే పార్టీ బూత్ స్థాయిలో పటిష్టం కావాలని అన్నారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో మళ్లీ విజయం సాధించడం తథ్యం అంటూనే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేరని అనడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు ఈ వ్యాఖ్యలను పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామంపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసిందని.. యడ్డీ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మోదీ స్థాయి నేతపై అలా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

Also Read : హెరాయిన్- ఆంధ్రప్రదేశ్ : బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతున్న ఓ వర్గం మీడియా

అది నిరసన గళమేనా?

దక్షిణాదిలో ఉనికి లేని బీజేపీకి కర్ణాటకలో బలమైన పార్టీగా తీర్చిదిద్దిన ఘనత యడ్యూరప్పదే. పార్టీని రెండుసార్లు అధికారంలోకి కూడా తీసుకొచ్చారు. ఆ రెండుసార్లూ ఆయన్ను మధ్యలోనే పార్టీ అధిష్టానం పదవి నుంచి దించేసింది. తొలిసారి అవినీతి కేసుతో.. రెండోసారి మొన్న జూలైలో వయసు సాకుతో పదవి నుంచి తప్పించారు. తనను చిన్న చూపు చూసినందుకు నిరసనగా 2011లో బీజేపీని చీల్చి యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టారు. తర్వాత కొంతకాలానికే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి మరీ యడ్డీ బీజేపీని అధికారంలోకి తెచ్చారు.

అయితే రెండేళ్లకే పార్టీ అతన్ని సీఎం పదవి నుంచి తప్పించింది. గత అనుభవం దృష్ట్యా యడ్డీ మళ్లీ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతారన్న అనుమానాలు అధిష్టానానికి మొదటి నుంచీ ఉన్నాయి. అందుకు తగినట్లే యడ్డీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ఆయన తనయుడు విజయేంద్ర కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. పార్టీ సమావేశం సందర్బంగానే.. మీ తండ్రి చేపట్టాలనుకున్న రాష్ట్ర యాత్రకు పార్టీ అధిష్టానం బ్రేకులు వేసిందా.. అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ అన్ని బ్రేకులు యడ్యూరప్ప చేతిలోనే ఉన్నాయి.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు.. ఎవరికి వేయాలంటే వారికి ఆయనే బ్రేకులు వేస్తారని నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. పార్టీలో కలకలం రేపుతున్న తండ్రీకొడుకుల వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తున్న ఆసక్తి పార్టీవర్గాల్లో నెలకొంది.

Also Read : సీఎంలను మారిస్తే ఎన్నికల్లో గెలుస్తారా?గతంలో గెలిచారా?