Idream media
Idream media
‘వచ్చే రెండున్నరేళ్లూ నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా… రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన మీడియాతో అన్నారు. తన నాయకత్వం విషయంలో రాష్ట్ర పార్టీలోను, అధిష్ఠానానికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవని అంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెబుతున్నారు.
ప్రచారాలు నమ్మొద్దు..
కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడ్యూరప్ప ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వంటి చర్యల ద్వారా బీజేపీ పెద్దలు కర్ణాటక సీఎం విషయంలో సానుకూలంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసి గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారనే కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు నేపథ్యంలో యడ్యూరప్పకు ప్రత్యామ్నాయం చూడక తప్పదన్న నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన యడ్యూరప్ప ఫిబ్రవరి 27న తన పుట్టినరోజు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత తాను అధిష్ఠానం సూచించిన వ్యక్తికి నాయకత్వం అప్పగిస్తానని కోరారని వార్తలు వచ్చాయి. వీటన్నింటకీ చెక్ పెడుతూ యడ్యూరప్ప తాజాగా మాట్లాడారు.
అరుణ్ సింగ్ స్పష్టత ఇచ్చారు…
ఆ ఊహాగానాలను తాను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్ స్వయంగా నాయకత్వ మార్పు అంశంపై స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఈ నెల 4, 5 తేదీల్లో బెంగళూరులో జరగనున్న బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో అభివృద్ధి అంశాలే ప్రధానంగా చర్చిస్తామన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, రాష్ట్ర పరిపాలనను సమర్థంగా, పారదర్శకంగా ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తును నూతన సంవత్సరం తొలి నెలలోనే చేపట్టనున్నామని ప్రకటించారు. కరోనా ఆర్థిక సంక్షోభాల కారణంగా కొన్ని శాఖలకు నిధుల కోత అనివార్యమైందని, కొత్త బడ్జెట్‌లో వాటిని సరిదిద్దుతామని సీఎం భరోసా ఇచ్చారు. అయితే ఇవన్నీ యడియూరప్ప తనను తాను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారని మరికొందరు ఇప్పటికీ చెబుతుండడం గమనార్హం.