iDreamPost
android-app
ios-app

అప్పుడు, ఇప్పుడు మధ్యలోనే ఇన్నింగ్స్‌ను ముగించిన యడ్యూరప్ప..!

అప్పుడు, ఇప్పుడు మధ్యలోనే ఇన్నింగ్స్‌ను ముగించిన యడ్యూరప్ప..!

ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను దించేస్తారని, లేదా ఆయనే దిగిపోతారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్న యడ్యూరప్ప ఆ వెంటనే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. అంతకు ముందు పార్టీ సమావేశంలో భావోద్వేగానికి గురైన యడ్డీ.. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

చెప్పినట్లుగానే తప్పుకుంటున్న యడ్డీ..

దాదాపు ఏడాది నుంచి యడ్యూరప్పు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో ఆయన తనయుడు విజేయంద్ర జోక్యాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్‌ మంత్రులు ఈ విషయంపై పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ కారణాలతోనూ వయస్సు కూడా పైబడడంతో యడ్డీకి విశ్రాంతిని ఇవ్వాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చింది. ఈ విషయంలో కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో కుమారుడును వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లిన యడ్యూరప్ప.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నం కావడంతో కుమారుడు విజేంద్రకు పదవి ఇప్పించుకునేందుకు ఆయన చర్చలు జరిపారనే వార్తలు వెలువడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. యడ్డీ చర్యలు ఆయన రాజీనామా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పాయి. 25వ తేదీన అధిష్టానం తాను ఏం చేయాలో ఆదేశిస్తుందని, ఆ నిర్ణయాన్ని తాను పాటిస్తానంటూ ఈ నెల 22వ తేదీన యడ్యూరప్ప ప్రకటించారు. చెప్పినట్లుగానే.. ఈ రోజు రాజీనామాపై నిర్ణయం తీసుకుని, వెంటనే అమలు చేశారు.

Also Read : ముందే కర్చిఫ్‌ వేసిన సీనియర్‌ నేత.. అనుమానాలకు తెరపడినట్లేనా..?

అప్పుడు మూడేళ్లు.. ఇప్పుడు రెండేళ్లు..

2008లో కర్ణాటకలో బీజేపీ 110 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో బలమైన లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సిన తరుణంలో స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. యడ్డీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే భూకుంభకోణం, మైనింగ్‌ ఆరోపణలపై కర్ణాటక లోకయుక్తా యడ్డీని దోషిగా తేల్చింది. దీంతో యడ్డీ చేత బీజేపీ బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన యడ్డీ.. బీజేపీకి 2011 జూలైలో రాజీనామా చేశారు. ఆ తర్వాత కర్ణాటక జనతా రక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

2013 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, యడ్డీ పార్టీలు పోటీ చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ 122 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 70 సీట్లకు పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత యడ్డీ తన పార్టీని బీజేపీలో భేషరతుగా విలీనం చేశారు. యడ్డీని మళ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీ అధిష్టానం నియమించింది.

2018 ఎన్నికలకు బీజేపీ యడ్డీ నేతృత్వంలో వెళ్లింది. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో ఈ సారి 104 సీట్లను గెలుచుకున్న బీజేపీ అధికారానికి తొమ్మిది సీట్ల దగ్గర ఆగిపోయింది. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెజార్టీని నిరూపించుకోవడంలో విఫలమైంది. కాంగ్రెస్, జేడీఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రెండు రోజుల్లోనూ యడ్డీ రాజీనామా చేశారు. మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్‌.. కాంగ్రెస్‌ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం మధ్యలోనే పడిపోయింది. జేడీఎస్, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా పార్టీలకు రాజీనామా చేయడంతో.. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన ఆ పదవి నుంచి దిగిపోతున్నారు. 2008 నుంచి 2011 వరకు మూడేళ్లు సీఎంగా పని చేసిన యడ్డీ.. ఈ సారి రెండేళ్లకే దిగిపోవాల్సి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించిన 78 ఏళ్ల యడ్డీ రాజకీయ భవిష్యత్‌ ఏమిటన్నది ప్రస్తుతం ఆసక్తికరం.

Also Read : 25న వారు ఆదేశిస్తారు.. 26న నేను పాటిస్తా! కర్ణాటక సీఎం యడ్యూరప్ప కొత్త పల్లవి