Idream media
Idream media
బీఎస్.యడ్యూరప్ప.. దక్షిణ భారతదేశంలో తలపండిన రాజకీయవేత్త. బీజేపీలో సీనియర్ నాయకుడు. 1970లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించి కీలక స్థానానికి చేరుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఏకంగా నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. విచిత్రం ఏంటంటే.. ఆయన ఎప్పుడూ అయిదేళ్లూ పూర్తిగా పాలన సాగించలేదు. విభిన్న కారణాలతో అన్ని సార్లూ రాజీనామా చేయాల్సి వచ్చింది. మొదటిసారి సీఎం అయిన యడ్డీ అవినీతి ఆరోపణలపై 2011లో రాజీనామా చేశారు. తర్వాత 2018లో సీఎం అయినా ప్రభుత్వం మైనారిటీలో పడిపోవటంతో రాజీనామా చేశారు. తర్వాత మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అయినా బలనిరూపణలో విఫలమై రాజీనామా చేశారు. అనంతరం గతేడాది అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
అలాంటి యడ్యూరప్ప ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే ఇక్కడో టిస్ట్ ఉంది. ఇది నిజంగా కాదు. కేవలం సినిమా వరకే పరిమితం. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రంతిప్పిన చాలామందిని మనం చూశాం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. తనూజ అనే సినిమాతో యడ్యూరప్ప తెరంగేట్రం చేస్తున్నారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్యూరప్ప సీఎంగా నటిస్తున్నారు. హరీష్ ఎండీ హళ్లి ఈ మూవీకి దర్శకుడు. బియాండ్ విజన్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రస్తుతం యడ్యూరప్పకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమాలో యడ్యూరప్ప నటించడం వెనుక ప్రధానమైన కారణం లేకపోలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనూజ అనే అమ్మాయి కోవిడ్ కారణంగా నీట్ పరీక్ష రాయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ తర్వాత ఓ ఇద్దరు జర్నలిస్టుల సాయంతో ఆమె పరీక్ష రాసింది. నీట్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తనూజ పరీక్ష రాసేందుకు 350 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ ప్రేరణతో తీస్తున్న సినిమా కావడంతోనే యడ్యూరప్ప నటించడానికి ఒప్పుకున్నట్లుగా దర్శకుడు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు కూడా ఆయన సీఎం (సినిమాలో మాత్రమే) అనిపించుకోవడం.. ఆసక్తిగా మారింది.