iDreamPost
android-app
ios-app

య‌డియూర‌ప్పకు కొత్త క‌ష్టాలు.. స‌హ‌చ‌రుల నుంచే త‌ల‌నొప్పులు

య‌డియూర‌ప్పకు కొత్త క‌ష్టాలు.. స‌హ‌చ‌రుల నుంచే త‌ల‌నొప్పులు

కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌కు త‌న‌ ప్ర‌భుత్వ స‌హ‌చ‌రుల నుంచే త‌ల‌నొప్పులు పెరుగుతున్నాయి. ఆ ప‌ద‌వి నుంచి య‌డియూర‌ప్ప‌ను మార్చాల‌ని ఓ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యడియూరప్పని తొలగించాలని బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేశార‌ట‌.

దీనికి తోడు తాజాగా పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. యోగీశ్వ‌ర్.. సొంత ప్ర‌భుత్వాన్నే ఇరుకున పెట్టేలా మ‌రోసారి వ్యాఖ్య‌లు చేశారు. య‌డియూర‌ప్ప‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఇది శుద్ధమైన బీజేపీ ప్రభుత్వంగా లేదు, మూడు గ్రూపుల సర్కారు మాదిరి ఉంది. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్‌లతో కుమ్మక్కయ్యింది” అని విమర్శించారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళుతుంటా, వస్తుంటా, అవన్నీ మీడియా ముందు చెప్పలేను. నా ఢిల్లీ పర్యటనపై ఈ ప్రచారం ఎందుకు జరిగిందనేది అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి మార్పు తన ఉద్దేశం కాదు, సొంత పనిమీదే వెళ్లాను అన్నారు.

మ‌రోవైపు.. ముఖ్య‌మంత్రి మార్పుపై వ‌స్తున్న ఊహాగానాల‌పై య‌డియూర‌ప్ప స్పందించారు. “ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నది కరోనా సవాల్‌ మాత్రమే. దానిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో చేస్తాను. ఢిల్లీకి వెళ్లినవారికి హైకమాండ్‌ తగిన సమాధానం చెప్పి పంపింది. శాసనసభా పక్ష సమావేశం గురించి మీ ముందు చర్చించలేను” అని మీడియా ముందు వ్యాఖ్యానించారు.

సీఎం మార్పు కోసం బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందించారు. ఎవరో ఒకరు ఎక్కడికో వెళ్లి వచ్చారంటే, వారికి హైకమాండ్‌ సమాధానం చెప్పి పంపింది క‌దా అన్నారు. రాష్ట్రంలో నాయ‌క‌త్వ మార్పు కోరుతున్న వారికి దీటైన జ‌వాబు చెప్పింద‌ని పేర్కొన్నారు.

కొవిడ్-19పై పోరాట‌మే త‌మ ప్ర‌భుత్వం ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంటే నాయ‌క‌త్వ మార్పుపై అధిష్ఠానం దృష్టికి ఫిర్యాదులు వెళ్ల‌డం వాస్త‌వ‌మేన‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మ‌రో రెండేండ్ల‌లో కర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కూ యడియూర‌ప్పే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతార‌ని ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక య‌డియూరప్ప నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు జూన్ 7న స‌మావేశానికి పిలుపు ఇవ్వ‌డం క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇదిలా ఉండ‌గా, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా య‌డియూర‌ప్ప కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ముఖ్యమంత్రి మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీలోని కొందరు నేతల దెబ్బతో ఊహించని పరిణామాలను ఆయ‌న ఎదుర్కొంటున్నారు. ఈ మేర‌కు సొంత పార్టీలోని రెబల్ నాయకులను బుజ్జగించడానికి సీఎం బీఎస్. యడియూరప్ప ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు ఓ నిర్ణ‌యం స్ప‌ష్టం చేస్తోంది.

బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన 3, 667 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిందాల్ స్టీల్ ప్లాంట్ కు వేల ఎకరాలు కట్టబెట్టడంపై ఆ రాష్ట్రలోని కొందరు మంత్రులు బహిరంంగా మండిపడుతున్నారు. సీఎం కొడుకు తీరుతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతోనే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ (JSW)కు 3, 667 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2006లో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది. జిందాల్ స్టీల్ కంపెనీకి భూమి కేటాచయించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. బీఎస్. యడియూరప్ప తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నాయకులే వ్యతిరేకించడంతో వివాదం పెద్దది అయ్యింది.