Idream media
Idream media
గతం గతః అంటారు కానీ.. 2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మాత్రం ఎవరూ మరచిపోలేరు. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసిన అభ్యాగ్యులెందరో..! దాతల ఆపన్నహస్తం కోసం క్యూలు కట్టిన నిర్భాగ్యులెందరో..! ఇలా ఎన్నో దిగ్ర్భాంతికర అనుభవాలను పంచిన 2020 ఎన్నో కొత్త కొత్త అలవాట్లను కూడా పరిచయం చేసింది. సగటు జీవి లైఫ్‌స్టైల్‌ను మార్చేసింది. ఈ కరోనా సంవత్సరంలో ఆన్‌లైన్ వినియోగం బాగా పెరిగింది. చివరకు రాజకీయాలు కూడా ఎక్కువగా ఆన్‌లైన్ వేదికగానే జరిగాయి.
‘జూమ్’ బాబు
గడిచిన ఏడాది ఈ ఏడాది కరోనా వల్ల దెబ్బ తిన్నది ఆర్థిక వ్యవస్థే కాదు.. విద్యావ్యవస్థ కూడా. లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ పాఠశాలలు.. వేసవి సెలవుల తర్వాత కూడా తెరుచుకోలేదు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక చాలా విద్యాసంస్థలు మొదట్లో కలవరపడ్డాయి. కానీ.. ఈ ఏడాది విద్యాసంవత్సరం మొత్తం కరోనా కారణంగా తుడిచిపెట్టుకుపోబోతోందని గ్రహించి ఆన్‌లైన్ బోధన బాట పట్టాయి! ఆ బోధనకు ప్రధానంగా అక్కరకొచ్చింది జూమ్ యాప్. దీంతోపాటు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, జోహో, సిస్కో వెబెక్స్ లాంటి యాప్స్‌ను కూడా కొన్ని విద్యాసంస్థలు వాడుతున్నప్పటికీ వాడకంలో సౌలభ్యం వల్ల జూమ్ యాప్‌కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అలాగే.. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కలిసి దీక్ష పేరుతో ఉచిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్‌ను రూపొందించాయి. రాజకీయ నాయకులు కూడా ఈ జూమ్ యాప్‌పు విరివిగా వాడారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అయితే జూమ్ బాబుగా పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయన నేరుగా కన్నా జూమ్‌లోనే ఎక్కువగా కనిపించడంతో బాబుకు ఆ పేరొచ్చింది. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కూడా ఎక్కువగా ఆన్‌లైన్ వేదికగానే జరిగాయి.
ఓటీటీ.. ఏటీటీ
వెండి తెర వినోదం నట్టింటికి వచ్చిన సంవత్సరమిది. కొత్త సినిమా వచ్చాక కనీసం 45 రోజులకుగానీ ఓటీటీల్లో (ఓవ.ర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్) కనిపించని సినిమాలు.. కరోనా వల్ల ఈ ఏడాది నేరుగా ఓటీటీల్లోనే విడుదలయ్యాయి! లాక్‌డౌన్ సమయంలో బయటకు వెళ్లే అవకాశమే లేకపోవడంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్సే ప్రధాన కాలక్షేపంగా మారిపోయాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను మొదట్లో చిన్నచూపు చూసిన నిర్మాతల బింకం.. క్రమంగా సడలడం ప్రారంభమైంది. దీంతో పలు సినిమాలు ఓటీటీలో విడుదల కావడం ప్రారంభమైంది. తొలుత చిన్న సినిమాలకే పరిమితమైన ఓటీటీల్లోకి క్రమంగా పెద్ద నటుల సినిమాలు కూడా రావడం ప్రారంభమైంది. పలువురు ప్రముఖ దర్శకులు సైతం ఈ ఓటీటీల కోసం వెబ్‌సిరీస్‌లు, అంతాలజీలు నిర్మించేందుకు ముందుకొస్తున్నారు. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్, ఘోస్ట్ స్టోరీస్ వంటివి.. తమిళ అంతాలజీ పావ కథైగళ్ వంటివి ఇందుకు ఉదాహరణ.