Idream media
Idream media
వైసీపీ ప్రభంజనంలో టీడీపీ కంచుకోటలు బద్ధలవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల స్వగ్రామాలు, స్వంత మండలాల్లో వైసీపీ జెండా రెపరెపలాడగా.. నిన్న బుధవారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని వైసీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభంజనం ఈ రోజు వెలువుడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. వైసీపీ దెబ్బ జేసీ సోదరులకు కూడా గట్టిగా తగిలింది. స్వగ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.
జేసీ సోదరులు స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు మండలం జూటూరు ఎంపీటీసీ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. జేసీ సోదరుల కంచుకోట అయిన స్వగ్రామంలో తొలిసారి వారికి షాక్ తగిలింది. టీడీపీ, వైసీపీ మధ్య సాగిన హోరాహోరీ పోరులో అధికార పార్టీ అభ్యర్థినే విజయం వరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో.. ఒక్క ఓటు మెజారిటీతో వైసీపీ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది.
టీడీపీ అభ్యర్థి నాగిరెడ్డికి పోలైన ఓట్లు 1,127 కాగా 5 ఓట్లు స్వస్తిక్ గుర్తు సరిగా లేకపోవడంతో పరిశీలించారు. దీంతో టీడీపీకి వచ్చే ఓట్లు 1,122 అయ్యాయి. పరిశీలించిన ఐదు ఓట్లలో 3 ఓట్లు టిడిపి కి వచ్చాయని ఒక ఓటు చెల్లదని, మరొక ఓటు నోటాకు వేశారని అధికారులు పక్కన పెట్టారు. చెల్లని, నోటా ఓట్లలో 5 ఓట్లు పరిశీలించగా వాటిలో టీడీపీకి ఒకటి, నాలుగు వైసీపీకి ఉన్నట్లు అధికారులు కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ ఆ ఓట్లను ఆమోదించడంతో అంతిమంగా టీడీపీకి 1,126 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 1,127 ఓట్లు దక్కాయి. ఒక్క ఓటు మెజారిటీ తో వైసీపీ గెలిచింది. వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ రెడ్డికి రిటర్నింగ్ అధికారి గెలుపు ధృవీకరణ పత్రం అందించారు.
దశాబ్ధాల తరబడి అనంతపురంలో వర్గరాజకీయాలు చేస్తూ.. బలమైన నేతలుగా చెలామణి అవుతున్న జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు చివరికి సొంత గ్రామంలోనూ ఓటమి ఎదురుకావడం వారి ప్రభవాన్ని మరింత తగ్గించింది. 2019 ఎన్నికల్లో జేసీ సోదరులకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఓటమిని రుచిచూపించింది. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
పోయిన పరువును, పట్టును నిలుపుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేశారు. సర్వశక్తులు ఒడ్డడం, ఒక్కొక్క సామాజికవర్గానికి ఒక్కో ఏడాది చైర్మన్ పదవిని ఇస్తానని హామీలు ఇవ్వడంతో.. బోటాబోటీ మెజారిటీతో బయటపడ్డారు. వైసీపీ నీతివంతమైన రాజకీయాలు చేయడంతోనే మున్సిపల్ చైర్మన్‌గా తాను ఎన్నికయ్యానని ప్రభాకర్ రెడ్డి చెప్పిన విషయం ఇక్కడ గమనార్హం. అయితే ఇప్పుడు సొంత గ్రామంలోనే తాము నిలబెట్టిన ఎంపీటీసీ అభ్యర్థి నాగిరెడ్డి ఓడిపోవడం దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన జేసీ సోదరులకు కోలుకోలేని దెబ్బ అనడంలో సందేహం లేదు.
Also Read : Kuppam Municipality Results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ