iDreamPost
android-app
ios-app

ఏలూరు కార్పొరేషన్ – వైసీపీ భారీ విజయం ,మూడు డివిజన్లకే పరిమితమైన టీడీపీ

ఏలూరు కార్పొరేషన్ – వైసీపీ భారీ విజయం ,మూడు డివిజన్లకే పరిమితమైన  టీడీపీ

కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసీపీ విజయం సంపూర్ణమైంది. మార్చి 10వ తేదీన 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఏలూరు కార్పొరేషన్‌ కౌంటింగ్‌ కోర్టు తీర్పుతో వాయిదా పడింది. తాజాగా హైకోర్టులో విచారణ పూర్తవడంతో ఈ రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడయ్యాయి. మార్చి 14వ తేదీన వెల్లడైన ఫలితాల్లో 11 కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోగా.. తాజాగా ఏలూరు కార్పొరేషన్‌ను కూడా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుని నగరపాలికల్లో సత్తా చాటింది.

ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 47 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. 47 డివిజన్లలో 43 చోట్ల వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ కేవలం మూడు డివిజన్లకే పరిమితమైంది. వైసీపీ మేయర్‌ అభ్యర్థి షేక్‌ నూర్జహాన్‌ 50వ డివిజన్‌ నుంచి 1,495 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

16వ డివిజన్‌లో హోరాహోరీ..

పోలింగ్‌ జరిగిన 47 డివిజన్లలో 46 డివిజన్లది ఒక ఎత్తు అయితే.. 16వ డివిజన్‌లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ వైసీపీ, వైసీపీ రెబల్‌ అభ్యర్థి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఫలితాల్లోనే అదే పరిస్థితి కొనసాగింది. వైసీపీ రెబల్‌ అభ్యర్థి దేవరపల్లి సంతోషమ్మపై వైసీపీ అభ్యర్థి జుజ్జువరపు విజయనిర్మల ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. రీకౌంటింగ్‌ చేయాలని సంతోషమ్మ కోరడంతో.. అధికారులు 16వ డివిజన్‌ ఓట్లను మళ్లీ లెక్కిస్తున్నారు. ఈ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

రెండు డివిజన్లలో ఉప ఎన్నిక..

కార్పొరేషన్‌లో రెండు డివిజన్లకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 45వ డివిజన్‌ నుంచి చంద్రశేఖర్, 46వ డివిజన్‌ నుంచి ప్యారీ బేగంలు విజయం సాధించారు. వైసీపీకి చెందిన వీరిద్దరూ ఇటీవల కరోనా వైరస్‌ వల్ల మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : ఏపీలో మళ్లీ స్థానిక ఎన్నికల హడావుడి..