Idream media
Idream media
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ (వైసీపీ) తన పట్టును నిలుపుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ పదికి పది సీట్లు గెలుచుకుంది. 13 జిల్లాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తాను చాటుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగిసిన రెండు దఫాల ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఉన్న ప్రజా బలాన్ని తెలుపుతోంది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతోపాటు టీడీపీ మాజీ, తాజా ప్రజా ప్రతినిధుల సొంత గ్రామాల్లోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది.
నెల్లూరు జిల్లాలో తొలి, రెండు విడతల్లో కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పల్లెపోరు జరిగింది. 19 మండలాల్లోని 356 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 296 పంచాయతీల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 60 స్థానాల్లో టీడీపీ, స్వతంత్రులు గెలుపొందారు. మొత్తం మీద 83.14 శాతం పంచాయతీలను అధికార పార్టీ మద్ధతుదారులు కైవసం చేసుకోవడం ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న మద్ధతుకు నిదర్శనంగా నిలుస్తోంది.
బీదకు పరాభవం..
ఎమ్మెల్సీగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెలామణి అవుతున్న బీద రవించంద్రకు సొంత గ్రామంలో పరాభవం తప్పలేదు. బీద స్వగ్రామమైన కావలి నియోజకవర్గం అల్లూరు మండలం, ఇస్కపల్లిలో వైసీపీ మద్ధతుదారుడు జయకేతనం ఎగురువేశారు. వైసీపీ మద్ధతుదారుడుగా పోటీ చేసిన రంజిత్ 2,014 ఓట్ల మెజారిటీతో భారీ విజయం నమోదు చేశారు. కొన్నేళ్లుగా నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పని చేస్తున్న బీద రవిచంద్ర పేరు ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం సాగింది. అచ్చెం నాయుడు లేదా బీద రవిచంద్రకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ఆ పార్టీలో ఊహాగానాలు సాగగా.. చివరకు అచ్చెం నాయుడుకు ఆ పదవి దక్కింది. టీడీపీలో ఇలాంటి స్థాయిలో ఉన్న తనకు స్వగ్రామంలో చుక్కెదురవడం బీద రవిచంద్ర జీర్ణించుకోలేకపోతున్నారు.
బొమ్మిరెడ్డి స్వగ్రామంలో వైసీపీ..
ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి కూడా స్వగ్రామంలో పరాభవం తప్పలేదు. రాఘవేంద్ర రెడ్డి స్వగ్రామంలో వైసీపీ బలపర్చిన అభ్యర్థి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. రాఘవేంద్ర స్వగ్రామం బట్టేపాడులో సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. కొన్ని పర్యాయాలు ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీవమవుతుండగా.. ఈ సారి పోటీ తప్పలేదు. బీసీకి రిజర్వ్ అయిన బట్టేపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ తరఫున చెరుకూరి చిన చెంచయ్య, బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి బలపర్చిన అభ్యర్థి వడ్లపూడి పెంచలయ్యపై 83 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండు సార్లు ఎమ్మెల్సీగా, ఒక సారి జడ్పీ చైర్మన్‌గా పని చేసిన రాఘవేంద్ర రెడ్డి ఈ సారి కూడా తన గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.