iDreamPost
android-app
ios-app

పెరుగుతున్న వైసీపీ బలం, మారుతున్న బీజేపీ స్వరం 

  • Published Feb 19, 2022 | 1:59 AM Updated Updated Mar 09, 2022 | 1:25 PM
పెరుగుతున్న వైసీపీ బలం, మారుతున్న బీజేపీ స్వరం 

రాజకీయాల్లో వ్యక్తుల,బలాబలాలను బట్టే ఆయా వ్యక్తులు, పార్టీల ప్రాధాన్యత ఉంటుంది. బలమైన నేత, బలమైన పార్టీ ఏం చేసినా, ఏంచెప్పినా చెల్లుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా ప్రత్యేకించి భారతదేశ ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటేనే ఆధిక్యత. ఎవరికి ఆధిక్యత ఉంటుందో వారిదే అధికారం. వారి మాటే చెల్లుబాటు అవుతుంది.

ఇప్పుడు కేంద్రంలో బలాబలాలు, సమీకరణాలు మారుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో అధికారం చేపట్టిన బీజేపీ నాయకత్వం కాస్త దూకుడుగానే ఉంది. లోక్ సభలో 22 మంది సభ్యులున్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకత్వం అంతగా పట్టించుకోలేదు. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్ సభలో 301 మంది సభ్యులున్న బీజేపీ నాయకత్వం తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. మొత్తం 54 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ కానీ, 24 మంది సభ్యులున్న డీఎంకే కానీ, 22 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను బీజేపీ నాయకత్వం ఖాతరు చేయలేదు. మొత్తం లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వం పెడచెవిన పెట్టింది. 

అయితే ప్రస్తుతం రాజకీయాలు మారుతున్నాయి. ఉత్తరాదిన ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనప్పటికీ వాటిప్రభావం పరోక్షంగా ఎక్కువగానే ఉంటుంది. ఆ ప్రభావం రాజ్యసభలో ఎక్కువగా ఉంటుంది. మొత్తం 245 మంది సభ్యులున్న సభలో ప్రభుత్వ బలం 120 మంది సభ్యులు కాగా ప్రతిపక్ష బలం 117 మంది సభ్యులు. ప్రభుత్వం గట్టెక్కాలంటే తటస్థంగా ఉన్న 62 మంది సభ్యుల బలం బీజేపీ నాయకత్వానికి అవసరం.  ఈ తటస్థుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఒకటి. దానికి ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్నారు. ఈ సంఖ్య రానున్న జూన్ నెల నాటికి తొమ్మిది అవుతుంది. ఈ లెక్కలు చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనుంది. లోక్ సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో జూన్ నాటికి 9 మంది సభ్యులతో ఒక బలమైన శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకూ ఒంటెద్దు పోకడ పోయిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు మెల్లగా స్వరం మార్చుతోంది. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల బీజేపీ తీరు మారుతున్నట్టు కనిపిస్తోంది. 

మొన్న కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కమిటీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రావడం కానీ, అంతకుముందు సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ప్రస్తావించడం కానీ, నిన్న విజయవాడలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల మారుతున్న బీజేపీ నాయకత్వ స్వరాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల తర్వాత అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరిస్తోంది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కూడా ఉభయసభల్లో కలిపి అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ అది కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది. అందువల్ల అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షంతో కాకుండా తటస్థంగా ఉన్న అతిపెద్ద పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే బీజేపీ స్వరం మారుతోంది. బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరినట్టు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే పరిస్థితులు వచ్చినా ఇప్పుడు ఆశ్చర్యపోవాలసిన పనిలేదు. రాజకీయం మొత్తం లెక్కలే. ఆ లెక్కలు ఎటువైపు ఉంటే అధికారం అటువైపు మొగ్గుతుంది. ఇప్పుడు దేశంలో జరుగుతోంది ఇదే. మారుతోన్న బీజేపీ స్వరం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది.