iDreamPost
iDreamPost
రాష్ట్రంలో పెద్ద నగరమైన విశాఖపట్నంపై అధికార వైఎస్సార్సీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఉన్న విశాఖ ప్రగతికి ప్రభుత్వం ఇప్పటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దానికితోడు రాజకీయంగానూ ఆ నగరాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. గత ఏడాది జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 56 డివిజన్లతో విజయబావుటా ఎగురవేసింది. అంతేకాకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో నగరానికి పెద్దపీట వేయడంతో పాటు నగరంలో ప్రాబల్యం ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించింది. అదే ఊపులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నగరంపై పూర్తి పట్టు సాధించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
వెలగపూడి ఇలాకాలో పాగాకు..
విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అపూర్వ మెజారిటీ సాధించినా విశాఖ నగరంలో నాలుగు నియోజకవర్గాలు మాత్రం టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. అయితే తర్వాత పరిణామాలు మారిపోయాయి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి వైఎస్సార్సీపీ వైపు వచ్చేశారు.
నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్నికైన నాటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా కొన్ని నెలలుగా టీడీపీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడంలేదు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2009 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న ఆయన హవాను తగ్గించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
సామాజిక ఆధిపత్యం
తూర్పు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వైఎస్సార్సీపీ ప్రధానంగా సోషల్ ఇంజినీరింగ్ అస్త్రం ప్రయోగిస్తోంది. నియోజకవర్గంలో యాదవ, కాపు, మత్స్యకార సామాజికవర్గాల ప్రాబల్యం అధికం. దాంతో ఆయా వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తోంది. వెలగపూడిపై రెండుసార్లు పోటీ చేసిన యాదవ వర్గానికి చెందిన వంశీకృష్ణకు ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అక్కరమాని విజయనిర్మలకు వీఎంఆర్డీఏ పదవి.. అలాగే అదే సామాజికవర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారికి జీవీఎంసీ ఛైర్పర్సన్ పదవులు ఇచ్చారు. మత్స్యకార వర్గానికి చెందిన కోలా గురువులుకు మాత్స్యకార కార్పొరేషన్ పదవి, మరికొందరికి ఇతర పదవులు ఇచ్చారు. ఇక మిగిలిన కాపు సామాజికవర్గానికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఇప్పుడున్న నేతల నుంచి కాకుండా ఆ సామాజికవర్గం నుంచి సరికొత్త, బలమైన అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. కాగా నియోజకవర్గంలో వెలగపూడి జోరు గతంతో పోల్చుకుంటే తగ్గింది. ఆయన ప్రధాన ఆర్థిక వనరు అయిన మద్యం సిండికేట్లపై ప్రభుత్వ మద్యం పాలసీతో దెబ్బ పడింది. మద్యం అమ్మకాలన్నీ ప్రభుత్వ డిపోల్లోనే జరుగుతుండటంతో వెలగపూడి సిండికేట్ అధ్యర్యంలో పనిచేసిన సుమారు 40 షాపులు మూత పడ్డాయి. అలాగే మారిన పరిస్థితుల్లో వెలగపూడి అనుచరులు పలువురు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పున వైఎస్సార్సీపీ ఉదయించడానికి ఈ పరిణామాలన్నీ దోహదం చేస్తాయేమో చూడాలి.