Idream media
Idream media
ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జల.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.
వైసీపీ, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను సజ్జల తిప్పికొట్టారు. 2014లో తప్పటడుగులు వేసుకుంటూ ఎన్నికలకు వెళ్లామని, 2019 నాటికి ఒక ఆర్గనైజ్డ్ పార్టీగా మారామని సజ్జల చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడిన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఇలా చంద్రబాబు ఎప్పుడైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉబుసుపోక, చెట్టుకింద మాట్లాడుకునే వారి మాదిరిగా, నోటికి వచ్చింది చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ సారి ఢీ అంటే.. ఢీ అనే నాయకులకు టిక్కెట్లు ఇస్తామంటున్నారని, ఇలా అయితే కుప్పంలో మొదట మార్చాలని సజ్జల వ్యాఖ్యానించారు. దుర్గిలో గెలుపుపై మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు.. కుప్పంలో ఓటమిపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ తర్వాత.. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఎప్పుడైనా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిందా..? అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు అన్నేళ్ల పాలనలో చెప్పుకునేందుకు ఒక్క మంచి విషయం ఉందా..? అని ప్రశ్నించారు. ఒక్కసారి అయినా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి.. ఇది మేము చేస్తామని చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది అని సజ్జల ఎద్దేవా చేశారు. ఎప్పుడూ ఊతకర్రల మీద, ఎవరో ఒకరి కాళ్లు, గడ్డం పట్టుకునో, భుజాల మీద చేతులు వేసో ఎన్నికలకు వెళ్లారని.. చంద్రబాబు రాజకీయాన్ని సజ్జల గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కలు.. ఓట్ల చీలికలు గురించి తప్పా.. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు ఏనాడు సంపాదించలేదని విమర్శించారు. ఇప్పుడు కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారన్నారు.
2014లో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. 2019 ఎన్నికలు వచ్చే సరికి ఏమి చేయాలో పాలుపోక పసుపు కుంకుమ పేరుతో అప్పటికప్పుడు డబ్బులు వేశారని సజ్జల విమర్శించారు. నా కులం వారికి, నా అనుకునే వారికి, నా పార్టీ వారికి లబ్ధి చేకూర్చాలనే దుష్ట పాలనను చంద్రబాబు సాగించారని సజ్జల ఆరోపించారు. ఎన్నికల విషయంలోనూ, ప్రభుత్వ పాలనలోనూ చంద్రబాబు సాగించిన దుష్ట సాంప్రదాయాన్ని, విష సంస్కృతికి సీఎం వైఎస్ జగన్ చరమగీతం పలికారని సజ్జల చెప్పారు.
Also Read : చంద్రబాబు డైరెక్షన్ లోనే రంగా హత్య.. ఇప్పుడేమో.. : కొడాలి నాని హాట్ కామెంట్స్