iDreamPost
android-app
ios-app

ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై ప‌ట్టు బిగిస్తున్న ఎంపీలు

ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై ప‌ట్టు బిగిస్తున్న ఎంపీలు

‘‘విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం భారీగా కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం విచార‌క‌రం. రాష్ట్రానికి కేంద్ర సహకారం చాలా అవసరం. ప్ర‌త్యేక హోదా, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలకు పరిష్కారం చూపించండి. గ‌త నెలలో రెండు రోజుల పాటు మా ముఖ్య‌మంత్రి ఢిల్లీలోనే ఉండి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర పెద్ద‌ల‌ను అంద‌రినీ క‌లిశారు. ఏపీలోని అనేక సమస్యల మీద వినతిపత్రాలు సమర్పించారు. వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. అన్నింటి కంటే ప్ర‌ధాన‌మైన ప్ర‌త్యేక‌హోదా హామీని నెర‌వేర్చండి’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్ల‌మెంట్ లో పోరాడుతున్నారు.

ఢిల్లీలో ఎంపీలు మార్గాని భరత్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని బీజేపీ సరిదిద్దాలని.. ఏపీ విభజన హామీలపై ఎనిమిది ఏళ్లుగా పోరాడుతున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కేంద్రం గతీశక్తీ అంటూ కొత్త కథలు చెబుతోందని మండిపడ్డారు. గతీశక్తి పథకం నిధులను ఏపీ విభజన హామీలకు ఖర్చు చేయాలన్నారు. బడ్జెట్‌ కేవలం గణాంకాల గారడీ విద్యేనన్నారు. ‘‘కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్‌ పేదలు, రైతులకు వ్యతిరేకం. ఫెర్టిలైజర్స్‌ సబ్సీడీని 25 శాతం తగ్గించి రైతులకు అన్యాయం చేశారు. పీఎం గరిబ్‌ అన్న యోజన పథకం ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ఉపాధి హామీ పథకానికి కూడా బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించారు.

గ్రామీణాభివృద్ధి పథకాలకు కేటాయింపులు తగ్గించారు. స్వయం సహాయక పథకాలకూ బడ్జెట్‌లో నిధులు తగ్గించారు. కరోనా సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా బడ్జెట్‌ ఉండాలని నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ కూడా సూచించారు. కరోనాలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. సబ్సీడీల్లో కోత పెట్టారని’’ వైఎస్సార్‌సీపీ ఎంపీలు మండిపడ్డారు.

ఇది చెత్త బడ్జెట్‌: విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. చెత్త బడ్జెట్‌ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి మ‌రోసారి పెద‌వి విరిచారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్‌ విషయంలో ట్యాక్స్‌ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.