Idream media
Idream media
ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విపక్ష ఎంపీలు తమ రాష్ట్రాల సమసల్య పరిష్కారం కోసము, అభివృద్ధికి నిధుల కోసము తమ వాయిస్ వినిపిస్తున్నారు. తమ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం కోసం విన్నవిస్తున్నారు. సరైన స్పందన రాని పక్షంలో స్వరం పెంచి వెల్ లోకి దూకేందుకు కూడా వెనుకాడడం లేదు. ఏపీ ఎంపీలు కూడా పలు సమస్యలపై పార్లమెంట్ లో పోరాటం సాగిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడమే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గొంతెత్తడమే కాదు.. పలువురు మంత్రులతో ప్రత్యేకంగా భేటీలు అవుతూ ఏపీ పరిస్థితులను సవినయంగా వివరిస్తున్నారు. సమస్యలకు కారణాలు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధికి ఏర్పడుతున్న ఆటంకాలను, వాటి తొలగింపునకు కేంద్రం చేయాల్సిన సహకారాన్ని, తప్పనిసరిగా నెరవేర్చాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఆశించిన ఫలితాలను పొందడానికి సాధనాల లేదా, ఉపాయాల రూపాల్లో ముందుకెళ్తున్నారు. ఆ క్రమంలో విజయాలను సాధించే దిశగా ముందుకెళ్తున్నారు.
పోలవరం విషయంలో ఎంపీల పోరాటం ఫలించినట్లే కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కేంద్రం.. తాజాగా మాట మార్చింది. ఉద్యమాలు, నినాదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీ ఎంపీల పోరాటానికి దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టు అంచనాల ప్రకారం… రూ. 30 వేల కోట్ల రూపాయలు కేవలం భూ సేకరణ, బాధితుల పునరావాసానికే ఖర్చు అవుతుంది. ఆ మేరకు అంచనాలను సవరించారు. అయితే, ఆ ఖర్చు తమకు సంబంధం లేదని మూడు రోజుల క్రితం కేంద్రం తేల్చేసింది. కేవలం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కు మాత్రమే నిధులు ఇవ్వగలమని, 2013 – 14 సవరించిన అంచనాలు 20,398 కోట్లకు మించి నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ఆ నిధులు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ మాత్రమూ సరిపోవు. పైగా.. 20,398 కోట్ల నిధుల్లో ఇప్పటికే 11182 కోట్లు ఇచ్చేసినట్లు తాజా పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించింది. దాని ప్రకారం.. కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది తొమ్మిది వేల కోట్లు మాత్రమే. కేంద్రం నిర్ణయంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటానికి దిగారు. ప్లకార్డులు ప్రదర్శించి పలుమార్లు నిరసనలు తెలిపారు. అంతేకాదు పలువురు కేంద్ర మంత్రులను తరచూ కలుస్తున్నారు. ఇది సరికాదని, గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని విన్నవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమావేశం అయ్యారు.
పోలవరం నిధులపై కొద్ది రోజులుగా పార్లమెంట్ లో నినదిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు బుధవారం గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాలను, అయ్యే వ్యయాలను పూర్తిగా వివరించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ఎంపీల వివరణకు మంత్రి షెకావత్ స్పందించారు. అన్నింటినీ పరిశీలించి సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు ఆమోదిస్తామని పేర్కొన్నారు. గురువారమే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని కేంద్ర మంత్రి చెప్పినట్లు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మొత్తమ్మీద ఏపీని సస్య శ్యామలం చేసే కీలక ప్రాజెక్టు పోలవరం నిధుల విషయంలో వైసీపీ ఎంపీల పోరాటం, ఆ పోరాటం వెనుక జగన్ కృషి అభినందించదగినదే. గజేంద్రసింగ్ షెకావత్ చెప్పినట్లుగా ఆ మేరకు ఆమోదించి నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పుంజుకుంటాయి.