iDreamPost
android-app
ios-app

అప్ప‌న్న స‌న్నిధికి వ‌స్తాం : లోకేశ్ కు విజ‌య‌సాయి రెడ్డి స‌వాల్

అప్ప‌న్న స‌న్నిధికి వ‌స్తాం : లోకేశ్ కు విజ‌య‌సాయి రెడ్డి స‌వాల్

రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్‌, అశోక్‌గజపతిరాజే కారణమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్‌ విసిరిన సవాల్‌కు సిద్ధమన్న ఆయన.. తేదీ, సమయం చెప్తే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని తెలిపారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని, విజయవాడలో ఆలయాలను తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు.

చంద్రబాబు, కుట్రలు కవల పిల్లలు..

ఆలయాల్లో తాంత్రిక పూజలు, క్షుద్రపూజలు కూడా చంద్రబాబు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాక.. సదావర్తి భూములను అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భయం, భక్తి లేవన్నారు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు రాదన్న ఆయన.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలన్నదే చంద్రబాబు దురాలోచనని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు, కుట్రలు కవల పిల్లలు. సొంత మామ, తమ్ముడు, బావమరుదులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు శిక్షిస్తాడు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. చంద్ర‌బాబు కంటే ముందే విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొండ కింద ప్రాంతంలో రామ నామస్మరణతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొండకిందకు వచ్చి కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.