Idream media
Idream media
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పోరాటానికి వైసీపీ రాజీపడడం లేదు. తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎంపీలు వ్యవహరించిన తీరుతో ఆ విషయం మరోసారి స్పష్టమవుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో వైసీపీ ఎంపీలు పోలవరం ప్రాజెక్టు జాప్యంపై గొంతెత్తారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా 29 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 657 కోట్లుగా టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
సమావేశం అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాకు తాము వెల్లడించిన వాదనలను వినిపించారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరంకు తరలించాల్సిందిగా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఈ అంశాలను పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతామని ఆయన వెల్లడించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి విస్పష్టంగా చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
నష్టాల్లో ఉన్న ఏదైనా ప్రభుత్వరంగ సంస్థను పురుద్ధరించి వాటిని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప ఏకంగా తెగనమ్మడం పరిష్కారం కాబోదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ రంగ సంస్థలనేవి దేశానికి మూలధన ఆస్తి వంటివని, వాటిని అమ్మే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. విశాఖస్టీల్ ప్లాంట్‌ను తిరిగి లాభాల బాట పట్టించడానికి మూడు మార్గాలను తాము సూచించినట్లు చెప్పారు. అందులో సొంత గనుల కేటాయింపు, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌పై ఉన్న రుణ భారాన్ని ఈక్విటీ కింద మార్పు, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం వంటివి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలుగా సూచించినట్లు తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి వైఖరిని అనుసరిస్తోందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అన్నది పొందుపరిచినప్పటికీ 8 ఏళ్ళు పూర్తవుతున్నా బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిని అనుసరిస్తోందని మండిపడ్డారు. పాండిచ్చేరి శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో పాండిచ్చేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని పేర్కొన్న విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
ఏపీ విషయానికి వచ్చే సరికి ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు, ద్వంద ప్రమాణాలకు పాల్పడుతూ అవసరమైతే చట్టాలను సైతం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, స్పెషల్ స్టేటస్‌తోపాటు ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని అన్నారు.
మరోవైపు పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. అలాగే బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ. 5,056 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉపాధి పనులు చేసిన కార్మికులు వేతనాలు అందక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ బకాయిలు రూ. 6,750 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వంశధార ప్రాజెక్ట్‌కు సంబంధించి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.