iDreamPost
android-app
ios-app

జగన్‌ ప్లాన్‌ అదిరింది .. ఆచరిస్తే ఎమ్మెల్యేలకు ఎదురుండదు

జగన్‌ ప్లాన్‌ అదిరింది .. ఆచరిస్తే ఎమ్మెల్యేలకు ఎదురుండదు

ఎన్నికల సమయంలో చెప్పినట్లే జరుగుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. అర్హత ఆధారంగా, వివక్ష లేకుండా పథకాలు ఇస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పరిపాలన రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వ సేవలు, పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ.. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదీ వైసీపీ అధిష్టానంతోపాటు ఆ పార్టీ కార్యకర్తల మనసులోని మాట.

ఎన్నికలకు ముందు గ్రామ గ్రామాన్ని గడపగడపకు వైఎస్సార్, ఇంటింటికి నవరత్నాలు తదితర కార్యక్రమాలతో మూడు, నాలుగుసార్లు చుట్టిన అప్పటి వైసీపీ కో ఆర్డినేటర్లు.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఆయా గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. మెరుపుతీగ మాదిరిగా అప్పుడప్పుడు ఇలా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో మెరిసి మళ్లీ వారి వారి వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమవుతున్నారు. సమస్యలు చెప్పుకుందామనుకునే వారికి అందుబాటులో ఉండడం లేదు. దాదాపు 70 శాతం వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఇదే దారిలో నడుస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్, వైసీపీ సర్కార్‌పై ప్రజల్లో మంచి ఆధరణ ఉన్నా.. ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంతిమంగా నష్టం చేకూర్చుతుంది. ఇదే విషయంపై సమాలోచనలు జరిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఎమ్మెల్యేలను గ్రామాల బాట పట్టించేందుకు, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఆలకించి, పరిష్కరించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. సాదాసీదాగా కాకుండా పక్కాగా అమలయ్యేలా ఈ అంశంపై మంత్రివర్గంలో తీర్మానం కూడా చేశారు.

Also Read : గ్రామ స‌చివాల‌యాలు ఇక మ‌రింత మెరుగు

వారంలో ఖచ్చితంగా మూడు రోజులు ప్రతి ఎమ్మెల్యే గ్రామ సచివాలయాలను సందర్శించాలి. ఇలా నెలకు 12 రోజులు నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలకు వెళ్లాలి. మంత్రులు వారానికి రెండు రోజులు సచివాలయాలకు వెళ్లాలి. వీలైతే నెలకు 12 సార్లు వెళ్లాలి. అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలి. లోపాలు ఉంటే సవరించాలి. అభివృద్ధి పనులు, సమస్యలపై స్థానిక నేతలు, ప్రజలు ఇచ్చే వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.

గెలిచే వరకూ ప్రజల వెంటపడి దణ్నం పెడుతూ.. గెలిచిన తర్వాత కంటికి కూడా కనిపించలేదనే భావన మెజారిటీ ఎమ్మెల్యేలపై నెలకొంది. ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాల కోసం, ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టేసిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు.. గడిచిన 2 సంవత్సరాలు 2 నెలల కాలంలో ఆయా గ్రామాల మొహం కూడా చూడలేదనేది నగ్న సత్యం. ఫలితంగా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలకు ఇదో మంచి అవకాశం.

మంత్రివర్గం చేసిన తీర్మానం ప్రకారం వారానికి మూడు రోజులు, నెలకు 12 రోజులు అంటే ఏడాదికి 144 సచివాలయాలను సదరు ఎమ్మెల్యే సందర్శించాల్సి ఉంటుంది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనిష్టంగా 100 గరిష్టంగా 150 వరకు గ్రామ,వార్డు సచివాలయాలున్నాయి. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యే ఏడాదికి ఒక సారి గ్రామాలకు వెళతారు. రాబోయే మూడేళ్లలో మూడుసార్లు ఆయా గ్రామాలకు వెళతారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు తు.చ తప్పకుండా అమలు చేస్తే.. వారిపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత పోతుంది. మంచి పేరు వస్తుంది. తమ ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చారు, సమస్యలు విన్నారనే సంతృప్తి వారిలో కలుగుతుంది. అంతిమంగా అది ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు లాభిస్తుంది. ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకుంటారా..? లేదా..? అనేది వారి చేతుల్లోనే ఉంది.

Also Read : లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌