iDreamPost
iDreamPost
వైసిపి అంతర్గత వ్యవహారాలపై కొద్దిరోజులుగా వరుసగా కథనాలు అచ్చేస్తున్న ఎల్లోమీడియాకు కొందరు ఎంఎల్ఏలు షాకిచ్చారు. తాము పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నామంటూ రాసిన రాతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజారంజక పాలనను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై తమకు అసంతృప్తి వుండాల్సిన అవసరం ఏమిటంటే ఎంఎల్ఏలు, ఎంపి నిలదీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కొరత లాంటి సమస్యలను లేవనెత్తామే కానీ తాము అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదంటూ ఎల్లోమీడియాను వాయించేశారు.
పార్టీ ఎంఎల్ఏలు బొల్లా బ్రహ్మనాయుడు, చిర్ల జగ్గిరెడ్డి, సీదిరి అప్పల్రాజు, ధర్మాన ప్రసాదరావుతో పాటు ఎంపి రఘురామకృష్ణంరాజు విడివిడిగా మీడియాతో మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యంతోనే కాకుండా పార్టీలో అయోమయం సృష్టించేందుకు ఎల్లోమీడియా ద్వారా తెలుగుదేశంపార్టీ కుట్ర పన్నుతున్నట్లు మండిపడ్డారు. ఉంటే చంద్రబాబునాయుడుపైనే టిడిపి ఎంఎల్ఏలకు అసంతృప్తి ఉంటుందని కూడా వీళ్ళు అభిప్రాయపడ్డారు.
టిడిపిలోని అసమ్మతిని కప్పిపుచ్చుకునేందుకే తమపై చంద్రబాబు ఎల్లోమీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నట్లు బ్రహ్మనాయుడు మండిపడ్డారు. ఇసుక సరఫరాపై లోపాలను తాను ప్రస్తావించింది వాస్తవమే అయినా దాన్ని ఎల్లోమీడియా వక్రీకరిచిందని స్పష్టం చేశారు. వైసిపి ఎంఎల్ఏలను జనాల్లో పలుచన చేయటానికే ఎల్లోమీడియా కుట్రపూరితమైన రాతలు రాస్తోందంటూ సీదిరి అప్పల్రాజు ధ్వజమెత్తారు. జనాలు ఇబ్బందులు పడకుండా ఇసుకను ఎలా సరఫా చేయాలనే విషయంలో ఇచ్చిన సూచనలను కూడా ఎల్లోమీడియా అసంతృప్తిగా వర్ణించిందంటే దాని స్ధాయి ఏంటో తెలిసిపోతోందంటూ జగ్గిరెడ్డి మండిపోయాడు.
చంద్రబాబు హయాంలో నియమితుడై ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ శ్రీకాకుళం రిమ్స్ కాలేజీలో అవినీతికి పాల్పడుతున్నాడని ప్రస్తావించినా అవినీతేనా అంటూ ధర్మాన ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఎల్లోమీడియా జగన్ పాలనపై లేని సమస్యలను సృష్టిస్తోందంటూ అనుమానించాడు. మొత్తం మీద కొద్ది రోజులుగా ఎల్లోమీడియా ఓ వ్యూహం ప్రకారం అచ్చేస్తున్న అసమ్మతి రాతలకు ఎంఎల్ఏలు జాయింట్ గా ఒకేసారి షాకిచ్చారనే చెప్పాలి.